👉కాస్మోనాట్ యూరీ గగారిన్ జయంతి సందర్భంగా..
****
రెండవ ప్రపంచ యుద్ధానంతరం రష్యా,అమెరికాలు వివిధ రంగాల్లో పోటీ పడ్డాయి.అంతరిక్ష పరిశోధన లో తొలుత రష్యా ఆధిపత్యం సాధించింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన గగారిన్ తొలుత అంతరిక్షంలోకి వెళ్ళాడు.
యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్ 1934 మార్చి9 న రష్యా లో జన్మించాడు. ఆయన అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మానవుడిగా ప్రఖ్యాతి గాంచాడు. సోవియట్ యూనియన్ అంతరిక్ష నౌక వోస్టాక్ 1 లో గగారిన్ 12 ఏప్రిల్ 1961న అంతరిక్షంలో భూమి చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేశాడు. భూమిని చుట్టి వచ్చిన మొదటి మానవుడు అయ్యాడు. ఈ ప్రధాన మైలురాయిని సాధించడం ద్వారా ఆయన అంతర్జాతీయ సెలబ్రిటీ అయ్యాడు. హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్ బిరుదుతో సహా అనేక పతకాలు మరియు బిరుదులను అందుకున్నాడు.
ఆయన తల్లిదండ్రులు అలెక్సీ ఇవనోవిచ్ గగారిన్ మరియు అన్నా టిమోఫియెవ్నా గగారినా సామూహిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేశారు. తండ్రి నైపుణ్యం కలిగిన వడ్రంగి. యూరి నలుగురు పిల్లలలో మూడవవాడు. యువకుడిగా ఉన్నప్పుడు, యూరీ అంతరిక్షం మరియు గ్రహాలపై ఆసక్తి కనబరిచాడు. అంతరిక్ష యాత్ర గురించి కలలు కనడం ప్రారంభించాడు. యూరీని అతని ఉపాధ్యాయులు తెలివైన మరియు కష్టపడి పనిచేసే వ్యక్తిగా, కొన్నిసార్లు కొంటె కుర్రాడుగా భావించేవారు. అతని గణితం మరియు సైన్స్ ఉపాధ్యాయుడు సోవియట్ వైమానిక దళంలో యుద్ధ సమయంలో ప్రయాణించాడు. ఇది యువ గగారిన్‌పై ప్రభావం చూపింది.

ఫౌండ్రీమ్యాన్‌గా మెటల్‌వర్క్స్‌లో అప్రెంటిస్‌షిప్ ప్రారంభించిన తర్వాత , గగారిన్ సరతోవ్‌లోని సాంకేతిక ఉన్నత పాఠశాలలో తదుపరి శిక్షణ కోసం ఎంపికయ్యాడు. అక్కడ ఉన్నప్పుడు, అతను ఫ్లైట్ క్లబ్‌లో చేరాడు మరియు తేలికపాటి విమానాన్ని నడపడం నేర్చుకున్నాడు. 1955 లో తన సాంకేతిక విద్యను పూర్తి చేసిన తర్వాత అతను ఓరెన్‌బర్గ్ పైలట్ స్కూల్‌లో సైనిక విమాన శిక్షణలో ప్రవేశించాడు. అక్కడ అతను వాలెంటినా గోర్యాచెవాను కలిశాడు. మిగ్ 15 లో పైలట్ వింగ్స్ సంపాదించిన తర్వాత గగారిన్ 1957లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ముర్మన్స్క్ ఆబ్లాస్ట్ లో లువోస్టరి ఎయిర్ బేస్ కు కేటాయించబడ్డాడు. అతను నవంబర్ 5, 1957 న సోవియట్ ఎయిర్ ఫోర్స్ యొక్క లెఫ్టినెంట్ అయ్యాడు. నవంబర్ 6, 1959 న అతను సీనియర్ లెఫ్టినెంట్ హోదాను పొందాడు. గగారిన్ తన జీవితాంతం శారీరకంగా దృఢంగా ఉండేవాడు ఆయన మంచి క్రీడాకారుడు కూడా.
1960లో యూరీ గగారిన్ సోవియట్ అంతరిక్ష కార్యక్రమం కోసం 19 మంది ఇతర అంతరిక్ష అన్వేషకులతో ఎంపికయ్యాడు. చేపట్టబోయే అంతరిక్ష యాత్రకి శిక్షణ తీసుకున్నాడు. మొదట ఎంపిక చేసిన ఇరవై మందిలో శిక్షణలో వారి పనితీరు మరియు వారి మానసిక, శారీరక దృఢత్వం ఆధారంగా గగారిన్ మరియు ఘెర్మన్ టిటోవ్ మధ్య మొదటి ప్రయోగానికి చివరి ఎంపిక జరిగింది.
ఏప్రిల్, 12, 1961 ఉదయం కజకిస్థాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి వోస్టాక్ 1 ప్రయోగించబడింది. 12 ఏప్రిల్ 1961న గగారిన్ వోస్టాక్ 3KA-3 లో భూకక్ష్యలోకి ప్రవేశించి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి అయ్యాడు. భూమిని చుట్టి వచ్చిన మొదటి మానవుడు అయ్యాడు. వోస్టాక్ గంటకు 27,400 కిలోమీటర్ల వేగంతో భూమిని చుట్టుముట్టింది. ఫ్లైట్ 108 నిమిషాల పాటు కొనసాగింది.
యాత్ర తర్వాత గగారిన్ ప్రపంచ ప్రసిద్ధ సెలబ్రిటీ అయ్యాడు. ఆయన ఇటలీ , యునైటెడ్ కింగ్‌డమ్ , జర్మనీ , కెనడా మరియు జపాన్ వంటి అనేక ప్రదేశాలలో పర్యటించాడు. ఆయన “ఆర్డర్ ఆఫ్ లెనిన్”, “సోవియట్ యూనియన్ హీరో” బిరుదులతో పాటు దేశ,విదేశాలనుండి అనేక అవార్డులు పొందాడు. 1968 లో ఘట్స్క్ పట్టాణానికి గగారిన్ పేరు పెట్టారు.
1962 లో అతను సోవియట్ యూనియన్ యొక్క సుప్రీం సోవియట్‌కు డిప్యూటీగా సేవలందించాడు. ఆ తర్వాత స్టార్ సిటీకి వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు, అతను పునర్వినియోగ అంతరిక్ష నౌక కోసం డిజైన్లపై పనిచేశాడు. గగారిన్ స్టార్ సిటీలో ఏడేళ్లపాటు ఈ డిజైన్లపై పనిచేశాడు. అతను 12 జూన్ 1962న సోవియట్ వైమానిక దళానికి లెఫ్టినెంట్ కల్నల్ అయ్యాడు.గగారిన్ స్టార్ సిటీ కాస్మోనాట్ శిక్షణా స్థావరం యొక్క డిప్యూటీ శిక్షణ డైరెక్టర్ అయ్యాడు. అదే సమయంలో, అతను యుద్ధ పైలట్‌గా మళ్లీ చేరడం ప్రారంభించాడు. 27 మార్చి 1968న, చ్కలోవ్స్కీ ఎయిర్ బేస్ నుండి రొటీన్ శిక్షణా ఫ్లైట్ లో ఉండగా , అతను మరియు ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ వ్లాదిమిర్ సెరియోగిన్ కిర్జాచ్ పట్టణానికి సమీపంలో జరిగిన మిగ్ విమాన ప్రమాదంలో మరణించారు.
అంతరిక్షంలో యూరీ గగారిన్ సాధించినది పెద్ద విజయమే అయినా భూమి మీద ఆయన జీవించింది అతి స్వల్పకాలం. కేవలం 34 ఏళ్లు. ఆ ముప్పై నాలుగేళ్ల కాలాన్ని భూకక్ష్యలో అతడు గడిపిన గంటా 48 నిముషాలతో పోల్చవచ్చు. కక్ష్యలో ప్రతి నిముషాన్నీ ఆయన ఎంత ఇష్టంగా గడిపారో, కుటుంబంతో కూడా అంతే ఇష్టంగా గడిపారు.1934 మార్చి 9న జన్మించిన గగారిన్ 1961 ఏప్రిల్ 12న ఆకాశంలో భూమి చుట్టూ తిరిగి, 1968 మార్చి 27న తుదిశ్వాస విడిచారు.
వ్యాసకర్త ; యం.రాం ప్రదీప్ తిరువూరు
మొబైల్ : 9492712836