నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

👉ప్రకటించిన ఢిల్లీ అధిష్టానం

👉గల్ఫ్ ఓటు బ్యాంకు’ ఎటువైపు ?

J.SURENDER KUMAR,

గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్

ఎలక్షన్ కమిటీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి.

జీవన్ రెడ్డితో పాటు మరో మూడు స్థానాలకు పేర్లను

ప్రకటించింది.


రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో… గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన  జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ ఎటువైపు అనే విషయం మే 13న తేల నున్నది.

👉 గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం

దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.

👉గల్ఫ్ ఓటు బ్యాంకు

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం.  

👉అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు

నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%). 
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది.  కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డిని గురువారం రాత్రి ప్రకటించారు.

👉గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు

2023 డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు ₹ 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో పంపిణీకి శ్రీకారం చుట్టారు.