👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా…
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి , ముందస్తు ఏర్పాట్లతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు.
మార్చి 20 నుండి ఏప్రిల్ 01 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం ధర్మపురి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కూడా అంతకు మించి నాణ్యమైన సేవలందిస్తూ బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని అన్నారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసి, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక, పౌర సంబంధాలు, ఎండోమెంట్, గ్రామీణ మంచినీటి సరఫరా, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, మత్స్య శాఖ, రెవెన్యూ, తదితర శాఖల సమన్వయ సహకారంతో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు ప్రణాళికలు, ఏర్పాట్లతో విజయవంతం చేయాలని అన్నారు.
👉ప్లాస్టిక్ నిషేధం..
ఈ సారి ఉత్సవాలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, క్యూలైన్ల నిర్వహణ, నిరంతర బందోబస్తు ఏర్పాటు 350 మంది పోలీస్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు.
👉పార్కింగ్..
భక్తులకు అసౌకర్యం కలుగకుండా ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న సందర్భంలో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు, టెంట్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. శాశ్వత ప్రాతిపదికన సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
👉మెడికల్ క్యాంపులు..
వేసవి కాలం సందర్భంగా భక్తులకు దేవాలయం, గోదావరి నదీ తీరం, కోనేరు ప్రాంతం, తదితర ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని స్వచ్చంధ సంస్థల సహకారం తీసుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకునే జాగ్రత్తలకు సంబంధించిన సలహాలు, సూచనలు తెలిపే విధంగా ప్రచార సామగ్రిని పంపిణి చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కోసం రాష్ట్రంలోని బస్సులపై బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రచార సామాగ్రిని అంటించాలని, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అవసరమైన బస్సులను సమకూర్చాలని తెలిపారు. ధర్మపురి పట్టణ ప్రాంతంలోని అన్ని వార్డులలో, గోదావరి పరివాహక ప్రాంతంలో, భక్తులు బస చేసే ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, ముఖ్య కూడళ్ళలో చలివెంద్రాలను ఏర్పాటు చేయాలని, నిరంతర పారిశుధ్య పనులు నిర్వహించడానికి మూడు షిఫ్టులలో సిబ్బందిని నియమించాలని సూచించారు.

👉త్రాగునీటి సమస్యలు
త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుత్ సరఫరలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
👉అగ్నిమాపక వాహనాలు..
వేసవి కాలం దృష్ట్యా అగ్నిప్రమాదాలు జరుగకుండా, ప్రమాదాలు సంభవించినపుడు తక్షణ చర్యలు చేపట్టడానికి అగ్ని మాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. దేవాలయానికి సంబంధించిన, బ్రహ్మోత్సవాల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలిసే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు.
👉ట్రాఫిక్..
వాహనాలకు అంతరాయం కలుగకుండా రోడ్లను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచేందుకు ఆర్.అండ్ బి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి గుండం, బ్రహ్మ గుండం ప్రాంతాలలోకి భక్తులెవరు వెళ్ళకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. భక్తులు గోదావరీ నదిలో స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా 50 మంది గజ ఈతగాళ్లను నిరంతర పర్యవేక్షణ చేస్తూ అందుబాటులో ఉంచాలని అన్నారు.
👉కంట్రోల్ రూం..
కార్యక్రమాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. స్వచ్చంద సంస్థలు, స్థానిక వ్యాపారస్తులు, దాతల సహకారంతో నిర్వహించే అన్నదాన కార్యక్రమాలను సవ్యంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలతో నిర్వహించాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఎస్పి రఘు చందర్, ఆలయ ఈ.ఓ. శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ రామన్న, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.