విశాఖ లో ఉంటాను నా ప్రమాణ స్వీకారం ఇక్కడే జరుగుతుంది !

👉 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను. నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది. వైజాగ్‌ పట్ల నాకు ఉన్న కృతనిశ్చయం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో విజన్‌లో మంగళవారం జరిగిన సదస్సు లో రెండు వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.

ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖపట్నం ను చాలామంది వ్యతిరేకిస్తున్న, విశాఖను ఎలా తీర్చిదిద్దాలి ? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు


👉విశాఖ అభివృద్ధికోసం పదేళ్ల విజన్‌ ఇది మనం ఈ నగరాన్ని ఓన్‌ చేసుకోవాలి. కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలి.
దీనికోసం సాకారమయ్యేలా, వాస్తవ రూపంలో ప్రతింబింబించేలా వైజాగ్‌ కోసం మార్గదర్శక ప్రణాళిక రూందించాం. పెద్దగా కలలు కని, ఆచరణలో మాత్రం ఏమీ సాధ్యంకానట్టుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో, అనుకున్నవన్నీ సాకారమయ్యేలా ఈ విజన్‌ను రూపొందించాం.


పదేళ్లకాలంలో ఇవన్నీకూడా వాస్తవ రూపం దాలుస్తాయి. పదేళ్లకాలంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా ఈ విజన్‌ ఉంటుంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ? వైజాగ్‌ విషయంలో మనం ఏం చేయాలి ? వైజాగ్‌ అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చాలి ? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి ? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్‌ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి.
ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోతే ఈ విజన్‌ అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు.


ముందు గా ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్కడకు వచ్చి నివాసం ఉండాలి.
ఆది నేను అనగానే, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్‌ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.
వైజాగ్‌ కు మారుస్తాను అంటే చాలు, ఇక్కడ భూముల కబ్జా చేయడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు.


సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు. కోర్టులకు వెళ్తున్నారు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూడదు అని దీని వెనుక మరో చోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనగానే ఈ భూముల కొన్నవారంతా అక్కడ వారి భూముల రేట్లు తదుపరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లిపోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్‌ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.


రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి ? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. పైగా శాసన రాజధానిగా అమరావతిని ప్రటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయరాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేం ఎలాంటి వ్యతిరేకతా లేదు. కాని వాస్తవం ఏంటంటే.., అమరావతి అనేది 50వేల ఎకరాల వర్జిన్‌ ల్యాండు, ఖాళీ భూమి. రోడ్లు, నీళ్లు, విద్యుత్‌ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికి మాత్రమే వాళ్లు ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారమే ఎకరాకు ₹.2 కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే దానికి ముందు కనీసంగా ₹ 1లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం ఒక లక్ష కోట్లు అనుకుంటే.. 20 ఏళ్లలో ఏటా ₹.5 వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లో, అది చివరకు ఖర్చులు పెరిగీ, పెరిగీ ₹.15 లక్షల కోట్లో అయినా అవుతుంది. అందుకనే అమరావతి ఆలోచన కు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ అది చేయలేం అంటున్నాం.


👉 వైజాగ్‌ విషయానికొస్తే..


కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మంచి రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపు రేఖలు గణనీయంగా మారుతాయి.


👉కార్యనిర్వాహక రాజధానిగా..


ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్‌ సెక్రటేరియట్‌ ఒకటి ఉండాలి. ఇది దేశం దృష్టిని ఆకర్షించాలి. అలాగే దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్‌ కన్వెన్షన్‌ సెంటర్, అలాగే అహ్మదాబాద్‌ తరహాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఉండాలి. మ్యాచ్‌లు జరిగేటప్పుడు దేశం మొత్తమే కాదు , ప్రపంచం మొత్తంకూడా మాట్లాడుకోవాలి.
ఇవన్నీ వస్తే ప్రపంచంలో వైజాగ్‌ స్ధాయి పెరుగుతుంది.


👉దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం సంభ్రమాశ్చర్యంతో చూస్తుంది. ..


ప్రపంచ ఆధునిక సాంకేతిక రంగంలో అంశాలను బోధించేలా ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్శిటీ ఒకటి రావాల్సి ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మన విద్యార్థులకు ఇది చక్కటి వేదిక కావాలి.
అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేంగా సాగుతోంది. 15–18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు.
భోగాపురం ఎయిర్‌ పోర్టును అనుసంధానించేలా ఆరు లేన్లతో అందమైన బీచ్‌ కారిడార్‌ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది.
అలాగే మెట్రో రైల్‌ ప్రాజెక్ట్, ఏడాది కాలంలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టు.
దీంతో మొత్తం హారిజాంటల్‌ గ్రోత్‌ కారిడార్‌ ఏర్పడుతుంది. అలాగే డేటా సెంటర్, సబ్‌మెరైన్‌ కేబుల్‌ రూపంలో పెద్ద పెట్టుబడులు అదానీ పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవి అన్ని చేసాం అన్నారు.
వచ్చే 5–6 ఏళ్లలో విడతల వారీగా ఈప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది.
అలాగే ఆతిథ్య రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓబరాయ్, మై ఫెయిర్‌ కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. బెస్ట్‌ ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు రాబోతున్నాయి.
అలాగే ఎన్టీపీసీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రూపంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.
ప్రధానమంత్రి నిన్ననే దీనికి శంకుస్థాపన చేశారు.
ఇవన్నీ కూడా సాధ్యం కానివి కాదు. ఇవన్నీకూడా వాస్తవరూపంలోకి వచ్చేవే.
వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబోతున్నాయి.
ఇవేమీ ఊహించ లేనివి కూడా కాదు. ఇవన్నీ కూడా సాకారమయ్యేవే.
అలాగే హైస్పీడ్‌ రైలు కారిడార్లపై కూడా ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాం.
హైదరాబాద్‌ – వైజాగ్, విజయవాడ– బెంగళూరుల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీరావమే కాకుండా, సీఎంకూడా ఇక్కడకు వస్తే పదేళ్లకాలంలో వైజాగ్‌ ప్రపంచంలోని, దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీపడుతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా, అవరోధాలు ఉన్నా విశాఖ నగర వాసులకు నేను ఒక్కటే చెప్తున్నాను. మనం తప్పక విజయం సాధిస్తాం.