ఆంధ్రా గాంధీ వర్ధంతి..

👉నేడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి!


దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమర జ్వాల.. వావిలాల గోపాలకృష్ణయ్య. భరతమాత ముద్దుబిడ్డగా.. దేశ సేవలో తరించిన ధన్యజీవి. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బ్రిటీష్‌ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్య. వర్ధంతి ఏప్రిల్ 29.


చేతికి సంచి తగిలించుకొని సాదాసీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. బ్రిటీషు పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు. 1906 సెప్టెంబర్‌ 17న సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాల్గో సంతానంగా ఆయన జన్మించారు. క్వింట్‌ ఇండియా ఉద్యమం మొదలుకొని మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు.

పల్నాడు అపర గాంధీగా పేరుగడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
స్వాతంత్య్రం వచ్చాక ప్రజాసేవకు వావిలాల గోపాలకృష్ణయ్య మరింత చేరువయ్యారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడటంతో ఇక్కడ పోటీ చేసి తొలి శాసన సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించారు. 1952, 1955, 1962, 1972 ఎనికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా విజయం సాధించి 19 ఏళ్ల పాటు ప్రజా సేవలో నిలిచారు. ఆయన కృషి ఫలితంగానే శాతవాహన నూలు మిల్లు, ఫణిదం చేనేత సహకార సంఘం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటయ్యాయి.


ఆయన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు కూడా అందించింది.
గోపాలకృష్ణయ్య తన జీవిత కాలంలో పలు రచనలు చేసారు . తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు. ఆయన 2003ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు.


వ్యాసకర్త : యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492712836