ధరణికి ఏది రక్షణ ?

👉ప్రపంచ ధరిత్రీ దినోత్సవం !
*
ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు భూమిఫై మాత్రమే జీవరాశి మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. ఇతర గ్రహాలపై ఇందుకు అనుకూలమైన వాతావరణం లేదు. సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి అనేది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం.

అటు పర్యావరణం, వాతావరణంతోపాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరం అవసరమవుతున్నాయి.


ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’.1970 నుంచి ప్రారంభమైన ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ దేశాల్లో ఏప్రిల్ 22న జరుపుకుంటున్నాయి. భూగోళంపై మానవ ప్రభావాన్ని తెలియజేయడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.


పెరుగుతోన్న భూతాపం, వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగాహన పెంచి, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవడానికి 1970లో బీజం పడింది. 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండిపోవడంతో సముద్ర తీరమే ఆలంబనగా ఉన్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగు వేల పక్షులు ఆ చమురు తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక అవి ప్రాణాలొదిలాయి. జీవ వైవిధ్యం ప్రమాదంలో పడటంతో ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఈ సంఘటన పునాదిగా మారింది.


ధరిత్రి దినోత్సవాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్‌డే’గా మార్చింది. కొన్ని దేశాల్లో ‘ధరిత్రి వారం’ ను నిర్వహిస్తున్నారు. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారంతో ‘ధరిత్రీ వారం’ని జరుపుతున్నారు. మొత్తం 193 దేశాలు ‘ఎర్త్‌డే’లో భాగమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి. నీటి వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటాలి. తొమ్మిదో దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి.


ఈ ఏడాది మనం మండుతున్న ఎండలు చూస్తూనే ఉన్నాం. భూమి ఉమ్మడి ఆస్థి. కాబట్టి దీన్ని రక్షించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి.


👉వ్యాసకర్త: యం. రాం ప్రదీప్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి, తిరువూరు.
మొబైల్ : 9492712836