ఘనంగా శ్రీ కోదండరామ స్వామి చక్రస్నానం !


J.SURENDER KUMAR,

తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

అంతకుముందు ఉదయం 7.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు పల్లకిపై కపిలతీర్థం వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు చేస్తూ చక్రస్నానం చేశారు.

అనంతరం స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పీఆర్ తోటకు తరలించారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోట కొమ్మలవీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారు.

మధ్యలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ వైఖానశాచార్య ఆలయంలో ఆస్థానం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో  పార్థసారథి, కంకణభట్టార్‌  సీతారామాచార్యులు, సూపరింటెండెంట్‌ సోమశేఖర్‌, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.