👉మధ్యప్రదేశ్ లో….
J.SURENDER KUMAR,
మే మాసం ఒకటవ తేదీ నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నర్మదానది కి మరో పేరు రేవా నది. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్‌లో ఉన్న నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్లను నిర్మించారు.
ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా స్వచ్చంగా ఉంటుంది. ఘాట్‌ల వద్ద నది లోతు ఎక్కువగా ఉండదు. దీనివల్ల భక్తులు సులభంగా స్నానాలు చేయొచ్చు. అన్ని ఘాట్లలోనూ ఓంకారేశ్వర్ ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థ ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు.
ఇక్కడున్న ఇతర ముఖ్యమైన ఘాట్లలో చక్రతీర్థ ఘాట్, గోముఖ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్ రాం ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్ ఉన్నాయి. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

తీర్ధ స్నానం ఉత్తమం, దాని కంటే నదీస్నానం శ్రేష్టమని పెద్దలు చెబుతారు. పుష్కర సమయంలో నదీస్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్ళు ఈ నదిలో లభిస్తాయి. శివుడు గులక రాళ్ళలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.
👉పురాణాల్లో ….
మనుషులు పాపాలను పోగొట్టుకోడానికి నదుల్లో స్నానం చేస్తుంటారు. ఆ పాపాలన్నీ కలిసి నదులు అపవిత్రం అవుతున్నాయి. నదులు అపవిత్రం అవుతుంటే చూడలేని పుష్కరుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. తనను పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరుతాడు. దేవ గురువైన బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని పుష్కరుడికి బ్రహ్మదేవుడు సూచిస్తాడు. పుష్కరుడు నదిలో చేరగానే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి సప్త మహా ఋషులు ఆ నదికి చేరుకుంటారని చెబుతారు. ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని నమ్ముతారు.
👉నర్మదా నది ఆ పేరు …
మన దేశంలో పరమశివుడి కి జ్యోతిర్లింగాలు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంభుగా వెలసి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. పవిత్రమైన జ్యోతిర్లింగాల లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి. మన దేశంలోని అన్ని నదులు కూడా తూర్పు వైపుగా ప్రవహించి సముద్ర గర్భంలో కలిస్తే ఒక నర్మదా నది మాత్రం పశ్చిమ వైపు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది.

నర్మదా నది రెండు పాయలుగా రెండు పాయలుగా చీలి నర్మద, కావేరి నదులుగా ప్రవహిస్తున్నాయి.
ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని శివపురి గా పిలుస్తారు. నర్మదానది రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటుంది.
నర్మదా నది ని పైనుంచి చూస్తే ఓం అనే ఆకారంలో ఈ నది కనిపించడం వల్ల ఆ ప్రాంతంలో వెలసిన స్వామి వారికి ఓంకారేశ్వరు డు అనే పేరును పెట్టారు. ఓం కారేశ్వర ఆలయంలో నే ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈ ఓంకారేశ్వర ఆలయంలో స్వామి వారి శివలింగం పై అభిషేకం చేసేటటువంటి నీరు లింగం పై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది.
ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రతను సంతరించుకుందని, అక్కడి ప్రజలు ఎంతో విశ్వసిస్తారు. అందుకే నర్మదా నది నీటిని ఎంతో పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు.
ఈ ఆలయంలో ఉన్న గౌరీ సోమనాథ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ రాబోయే జన్మ రహస్యాలు సైతం తెలుస్తాయని భక్తులు నమ్మకం. ఈ జ్యోతిర్లింగ దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తుంటారు.