పసిపాపలను అర్థం చేసుకొని అండగా నిలుద్దాం!


👉నేడు ఆటిజమ్ అవగాహన దినోత్సవం !

బిడ్డ పుట్టినప్పట్నుంచీ ప్రతీరోజూ ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటారు. పాకడం, నిలబడడం, బోర్లా పడడం ఇలా ప్రతీది తల్లిదండ్రులకి ముచ్చటే. కానీ, కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు.. అందరి పిల్లల్లా వారు యాక్టివ్‌గా ఉండరు. ఓ మూలన ఉంటారు. బాధపడుతుంటారు. దీనికి కారణం ఆటిజమ్ అయి ఉంటుంది.

ఈ వ్యాధి లక్షణాలు ఏడాది లోపు నుంచే కనబడినా నాలుగేళ్ల వరకూ మనం గుర్తించలేం . ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది.
శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో కళ్లు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. మన దేశంలో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక‌ ప్రకారం, ఆటిజం అనేది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మతల్లో ఒక‌టి. ఇది అనేక రకాల లక్షణాల ద్వారా బ‌య‌ట‌ప‌డుతుంది. నిద్రలేమి, స్వీయ-గాయాల‌ వంటి సమస్యాత్మక ప్రవర్తనలతో పాటు, ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను కలిగి ఉంటారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ  ఏప్రిల్ 2వ తేదీని అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినంగా ప్ర‌క‌టించింది. పిల్లల్లో మంద బుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆటిజం అవగాహ‌నా దినం నిర్వహిస్తున్నారు. 2007వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు 2008వ సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్ 2 తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను దూరంగా వుంచ కూడదు. వారిని అర్ధం చేసుకోవాలి. వ్యాధి తొలి దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే నని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


వ్యాసకర్త ! యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492712836