👉నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం !
“చినిగిన చొక్కా అయినా తొడుక్కో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో” అన్నారు కందుకూరి వీరేశలింగం
పుస్తక పఠనం వలన మానసిక,
శారీరకఆరోగ్యంమెరుగవుతుంది. మేధస్సు సక్రమంగా పని చేసిఆలోచనలునియంత్రించేందుకు పఠనం దోహదం చేస్తుంది. అనవసర ఆలోచనల్ని నియంత్రించి శారీరక ఆరోగ్యం చేకూరుస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం మంచిది. గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. ప్రారంభంలో బోమ్మలు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలియజేసే పుస్తకాలు చదివించాలి. అలా చదివించి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. అదే విధంగా సైన్స్ పుస్తకాలు చదవాలి.
ఇంటర్‌నెట్ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండాఇంటర్‌నెట్‌లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్‌నెట్‌లో చదవడం వల్ల కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్‌పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, అదే పుస్తక పఠనం ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు.
మన జీవితాల్లో పుస్తకం ఒక భాగం. ఒంటరిగా ప్రయాణిస్తున్నపుడో, ఏమీ తోచనపుడో పుస్తకం నేనున్నానంటూ మన చేతిలో ఒదిగిపోతుంది.
నేడు పుస్తకం ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. అంతర్జాలం (ఇంటర్నెట్) టివి చాలా వరకు పుస్తకం మనుగడనుఅడ్డుకుంటున్నాయి. ఎవరు ఇపుడు పుస్తకాన్ని కొని చదవడం లేదు. రీడర్ షిప్ గణనీయంగా పడిపోయింది.
ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పుస్తక పతనావస్థను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23 నప్రపంచ పుస్తక దినంగా జరుపుకోవాలని యు.ఎన్.ఓ తీర్మానించింది.1995లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించడమే కాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా కూడా జరపాలని నిశ్చయించింది. రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున పురస్కారలతో గౌరవించాలని సూచించింది.
పుస్తకాలను డిజిటలైజ్ చేయడం వలన రచయితకున్న కాపీ హక్కులు హరించిపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా గ్రంధచౌర్యం ప్రబలిపోతున్నదని, కాపీ హక్కుల పరిరక్షణ చర్యలు తక్షణం చేపట్టకపోతే పుస్తకం మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుందని ఆందోళన చెందింది. అంతేకాదు యునెస్కో ఈ రోజుని ప్రపంచ పైరసీ వ్యతిరేక దినంగా కూడా ప్రకటించింది.
వ్యాసకర్త :యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492713836