శ్రీ క్రోధి సంవత్సరంలో రాజకీయంగా కొన్ని మార్పులకు అవకాశం !


👉 జ్యోతిష్య పండితులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ!


J.SURENDER KUMAR

శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రోజు రాష్ట్ర రాజధాని అయిన

హైదరాబాద్ పట్టణానికి సూర్యోదయ కాలానికి గణించబడిన 

జాతకాన్ని పరిశీలిస్తే  ఈ సంవత్సరం రాష్ట్రంలో

రాజకీయంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం

కల్పిస్తుంది అని ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య

శాస్త్రవేత్త ఓం సాయి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకుడు,

గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ, నూతన క్రోధి సంవత్సర గ్రహ

ఫలితాలను ‘ఉప్పు పాఠకుల కోసం తెలిపారు.

జ్యోతిష్య పండితుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ

ముందుగా
👉ఓం సాయి జ్యోతిష్యాలయం గూర్చి…

2004 ఏప్రిల్ లో తెలుగు భాషలో ఆన్లైన్ జ్యోతిష్య సేవలతో ప్రారంభమైన https://www.onlinejyotish.com/ ఈ సంవత్సరం ఏప్రిల్ తో 20 సంవత్సరాల పూర్తి  చేసుకున్నది. 

👉ఏడు భాషలలో జ్యోతిష్యం అందుబాటు..

తొలి తెలుగు జ్యోతిష్యం వెబ్సైట్ గా ఆరంభమైన ఈ ప్రయాణం నేడు ఏడు భాషల్లో ఇంగ్లీష్,  హిందీ,  తెలుగు,  మరాఠీ,  గుజరాతి,  కన్నడ,  మరియు బెంగాలీ భాషలలో జ్యోతిష్య సేవలతో  ముందుకు సాగుతోంది. 

👉15 లక్షలకు పైగా సందర్శకులు..సేవలు ఉచితం!

ప్రతినెల 15 లక్షల పైగా సందర్శకులు ప్రపంచంలోనే వివిధ దేశాల నుంచి https://www.onlinejyotish.com/  సందర్శిస్తారు.  ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుతో పాటు 7 భాషల్లో పూర్తి జాతక చక్రం,  పంచాంగం,  గుణమేళనం,  రాశి ఫలాలు మొదలైన  జ్యోతిష సేవలు ఉచితంగా పొందవచ్చు.   వెబ్సైట్ తో పాటుగా హిందూ జ్యోతిష్ ఆండ్రాయిడ్ ఆప్  10 లక్షల డౌన్లోడ్స్ పూర్తి చేసుకుంది.  ఈ ఆప్ ద్వారా కూడా ఏడు భాషల్లో జ్యోతిష సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. సినీ రంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్, సినీ హీరోయిన్లు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ  ను సంప్రదిస్తూ తమ గ్రహచార దోష నివారణ  కోసం పూజలు, పారాయణాలు చేస్తుంటారు.
శ్రీ క్రోధి సంవత్సరం ముఖ్యంగా మే ఒకటికి గురువు వృషభ రాశికి, మారడంతో ఈ మార్పులకు జరుగుతుంది అని శర్మ వివరించారు. ఈ సంవత్సరంలో పార్టీల, మరియు ఇతర సంస్థల, అధిపతుల విషయంలో మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.  ముఖ్యంగా వ్యతిరేకులు ఒత్తిడి కారణంగా ఈ మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు.


పరిపాలనపరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యంగా ఈ లగ్నానికి 12 ఇంటిలో పాప గ్రహాలైన శని, మంగళూడు ఉండటం వలన ఆర్థిక సంబంధ సమస్యలు రాష్ట్రాన్ని కొంత మేరకు ఇబ్బంది కలిగించినప్పటికీ,  ఆదాయం పెరగటం మరియు కేంద్రం నుంచి కూడా సరైన విధంగా ఆర్థిక సహాయం లభించడంతో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం బయట పడగలుగుతుంది అని సంతోష్ కుమార్ శర్మ వివరించారు.

👉రాశి ఫలాలు క్లుప్తంగా...

మేష రాశి

ఈ సంవత్సరం మేష రాశి వారికి గురువు మరియు శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన వారికి ఈ సంవత్సరం అంతా అన్ని విషయాల్లో విజయం చేకూరుతుంది.  అయితే రాహు గోచారం బాగుండదు కాబట్టి కొన్నిసార్లు తమ నిర్లక్ష్యం కారణంగా సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఈ సంవత్సరం విజయాలకు పొంగిపోకుండా  వినయంగా ఉండటం  వలన ఏ సమస్యలు లేకుండా గడిచిపోతుంది.

👉 వృషభ రాశి

వృషభ రాశి వారికి  ఈ సంవత్సరం మిశ్రమంగా  ఉంటుంది. మే ఒకటి నుంచి గురువు  గోచారం ఒకటి ఇంటిలో ఉండటం మరియు పదవ ఇంట్లో శని గోచారం ఉండటం అలాగే రాహు కేతువుల ప్రచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ ఉద్యోగ పరంగా మరియు వ్యక్తిగతంగా అనుకూలంగా ఉంటుంది.  చేపట్టిన  పనుల్లో కొంత శ్రమతో విజయం సాధించగలుగుతారు. కుటుంబ  జీవితం  బాగుంటుంది.

👉మిథున రాశి

ఈ సంవత్సరం మిధున రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది.  ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.  ఖర్చులు పెరుగుతాయి మరియు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా రాహు కేతువుల గోచారం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు కాబట్టి   ఉద్యోగ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.

👉కర్కాటక రాశి

ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి  గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.  అలాగే ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది.  చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.  ఉద్యోగం విషయంలో సాహసాలు పనికిరాదు.  కుటుంబ జీవితం బాగుంటుంది. అవివాహితులకు వివాహయోగం.

👉సింహరాశి

సింహరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  వృత్తిలో అభివృద్ధి ఉన్నప్పటికీ  చేపట్టిన ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  సహనాన్ని కోల్పోకుండా ప్రయత్నించడం మంచిది.  ఉద్యోగంలో అనుకొని మార్పులు ఉంటాయి.  కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఏర్పడే సమస్యలను . సహనం కోల్పోకుండా పరిష్కరించుకోవడం మంచిది.

👉కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.  గురువు మరియు  శని గోచారం  అనుకూలంగా ఉంటుంది కాబట్టి  ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా  ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది.  అయితే ఈ సంవత్సరం రాహుకేతుల గోచారం బాగుండదు కాబట్టి  అనవసరమైన విషయాల్లో  తలదూర్చి తర్వాత బాధపడకంటే  మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్లిపోవడం మంచిది.  ఈ సంవత్సరం సంతానం మరియు వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

👉తులారాశి

తులా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  ముఖ్యంగా గురువు గోచారం బాగుండదు కాబట్టి ఆర్థిక విషయాల్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా ఖర్చులు పెరగటం వలన ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతారు.  ఈ సంవత్సరం వీలైనంత వరకు పొదుపు చేసే ప్రయత్నం చేయడం మంచిది.  ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నప్పటికీ అది ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడదు.  పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ  రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉత్సాహం  తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు.

👉వృశ్చిక రాశి

ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి  సాధ్యమవుతుంది.  అంతేకాకుండా ఉద్యోగంలో ఉండే ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది.  ఇది పదోన్నతి కారణంగా కానీ లేదా బదిలీ కారణంగా గాని . సాధ్యమవుతుంది.  కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.  ఆరోగ్యం మెరుగు పడుతుంది.   శని గోచారం కారణంగా కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా ప్రధమార్ధంలో ఇది ఎక్కువగా ఉంటుంది.

👉 ధనూ రాశి

ఈ సంవత్సరం ధను రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  గురువు  గోచారం ఆరవ ఇంటికి మారడం వలన ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కానీ జరుగుతుంది.  అయితే శనిగోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మార్పు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది.  ఈ సంవత్సరం రాహు కేతువుల గోచారం బాగుండదు కాబట్టి కొన్నిసార్లు కుటుంబం కారణంగా కానీ  వృత్తి కారణంగా కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.  ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది సాధారణ సంవత్సరం.

👉మకర రాశి

మకర రాశి వారికి ఈ సంవత్సరం గడచిన సంవత్సరం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యంగా గురువు గోచారం మరియు రాహు కేతువుల గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది మరియు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  ఏలి నాటి శని గోచారం కూడా ఈ సంవత్సరంతో పూర్తవుతుంది కాబట్టి  వీరికి ద్వితీయార్థంలో అత్యంత అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం  అనుకూలమైన ఫలితం లభిస్తుంది.  కొత్తగా ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది.

👉కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.  గురువు, శని,  రాహు మరియు కేతువుల గోచారం  ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు కాబట్టి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం  ఉంటుంది. అలాగే వృత్తిలో  పని ఒత్తిడి పెరగటం మరియు అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి.  ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా సామాన్యంగా ఉంటుంది.  వీలైనంతవరకు పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ద్వితీయార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది.  ఈ సంవత్సరం ఏ పని చేపట్టిన వదిలివేయకుండా పూర్తయ్యే వరకు పట్టుదలగా ఉండటం మంచిది.

👉మీనరాశి

ఈ సంవత్సరం మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది.  శని రాహు మరియు కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం గురువు గోచారం మిశ్రమంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఉద్యోగంలో అనుకోని మార్పులు చేసుకోవటం మరియు ఖర్చులు పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  ఈ సంవత్సరం వీలైనంతవరకు అహంకారానికి పోకుండా వినయంగా ఉండటం మరియు ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి.  ఈ సంవత్సరం పెట్టుబడులకు అంతగా అనుకూలంగా ఉండదు.