తిరుమలలో ఉగాది ఉత్సవాలు !

👉ఈ నెల 9 న తెల్లవారుజాము నుంచి.


J.SURENDER KUMAR,

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర

ఉగాది ఉత్సవం ఈనెల 9న జరగనుంది.

ఈ పండుగను పురస్కరించుకుని, మొదట తెల్లవారుజామున

3 గంటలకు సుప్రభాతం, తరువాత ఆలయాన్ని శుద్ధి

చేస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ

మలయప్ప స్వామి, విష్వక్సేనులకు విశేష నైవేద్యాన్ని

సమర్పిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య విమాన

ప్రాకారం, మరియు ఆలయ ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా

ఆలయంలోకి ప్రవేశిస్తారు.

అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తిల ను నూతన వస్ర్తాలతో అలంకరిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులచే పంచాగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.


ఉగాది సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.

👉మహతిలో ఉగాది వేడుకలు

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ మరియు టిటిడి సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలను ఏప్రిల్ 9వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వనితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం ఎస్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ వేద అధ్యయనాల వారిచే వేదపారాయణం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు. అష్టావధానం అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలతో  “తెలుగు వైతాళికులు” ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగుల పిల్లలకు బహుమతులు అందజేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేస్తారు.