👉 పుష్కరాల తరహాలో ముందస్తు చర్యలు !
👉 పలు ఆలయాల నుండి అదనపు సిబ్బంది !
👉 అంజన్న దీక్షపరులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు.
J.SURENDER KUMAR,
ఈనెల 30 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాలతో ఆలయ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది.
గోదావరి పుష్కరాలలో భక్తజనంకు ముందస్తు సౌకర్యాల కల్పన తరహాలోనే కొండగట్టు క్షేత్రంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది.

శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో పలు ఆలయాల నుండి అదనపు సిబ్బందిని, కొండగట్టు కు డిప్యూటేషన్ పై నియమించారు. అంజన్న దీక్షాపరులకు, భక్తజనంకు అసౌకర్యాలు కలుగకుండా గతంలో ఎన్నడు కనివిని ఎరుగని రీతిలో రెండు వేల మంది నాయిని బ్రాహ్మణులు, మూడు వందల మంది అర్చకులు, మూడు రోజుల పాటు తాత్కాలిక నియామకాలు చేపట్టారు.
రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, వైద్య, పారిశుధ్యం, తదితర శాఖలతో సమన్వయం చేసుకొని పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం దేవాదాయ అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.
👉 సనాతన సాంప్రదాయ పద్ధతిలో..
స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భముగా క్షేత్ర సాంప్రదాయ పద్ధతిలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు, యాగశాలలో మూడు రోజులు త్రైయాహ్నిక యాగము, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్ర అనుసారముగా నిర్వహించనున్నారు.
👉 భద్రాచలం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు..
ఈ నెల 30 న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆలయం నుండి శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టువస్త్రాలు రానున్నాయి. వాటిని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చక స్వాములు వేదమంత్రాల తో భక్తుల కోలాటాల తో, కళాకారులచే స్వాగతం పలుకుతూ శోభాయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రాలు అలంకరిస్తారు.
👉 29 నుంచి అర్చిత సేవలు నిలిపివేత…
హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 29 బుధవారం నుంచి జూన్ 2 ఆదివారం నాటి వరకు స్వామివారి అన్ని ఆర్జిత సేవలను నిలిపి వేసినట్టు ఆలయాధికారులు తెలిపారు.
👉 నిరంతర దర్శనం..
ఈ నెల30 న శుక్రవారం తెల్లవారుజాము నుంచి జూన్ 2 ఆదివారం సాయంత్రం 4.30 గంటల వరకు విరామం లేకుండా భక్తజనంకు స్వామివారి దర్శనం కొనసాగుతుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు..
👉 కమిషనర్ రానున్నారా ?
మూడు రోజులపాటు లక్షలాదిమంది ఆంజనేయ భక్తులు జయంతి ఉత్సవాల కు కొండగట్టు క్షేత్రానికి తరలిరానున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి హనుమంతరావు, కొండగట్టుకు రానున్నట్టు ఆలయ ఉద్యోగులలో చర్చ.
గత నెలలో జరిగిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా కమిషనర్ కొండగట్టు క్షేత్రానికి రావడంతో చర్చకు ఆస్కారం ఏర్పడింది.