కౌంటింగ్ దృష్ట్యా పాలిసెట్ అడ్మిషన్ల షేడ్యూల్ లో మార్పులు !

👉జూన్ 7 నుండి 10 వరకు నమోదుకు అవకాశం !

👉జూన్ 13 న సీట్ల కేటాయింపు,14 నుండి తరగతులు ప్రారంభం !

👉సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి !


J.SURENDER KUMAR,

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.

ఇందుకు సంబంధించిన సవరణ నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేసారు. అమరావతి లోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఉన్నత స్ధాయి సమావేశంలో విభిన్న అంశాలను చర్చించి, విద్యార్ధులు, వారి తల్లి దండ్రుల నుండి వచ్చిన వినతుల మేరకు అవసరమైన తుది షేడ్యూలును ఖరారు చేసినట్లు నాగరాణి వివరించారు.

ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ప్రవేశాలకు సంబంధించిన ఫీజు చెల్లింపు , ధృవపత్రాల వెరిఫికేషన్ తదితరు ఆన్ లైన్ ప్రక్రియ తేదీలలో ఎటువంటి మార్పు లేదని, జూన్ 2 వరకు అవకాశం ఉంటుందన్నారు. 3న ఉన్న ధృవపత్రాల వెరిఫికేషన్ 6 న నిర్వహిస్తామని, ప్రత్యేక క్యాటగిరి అభ్యర్ధులకు సైతం ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. జూన్ 7 నుండి 10 వరకు ఐఛ్చికాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు.

జూన్ 11 న ఐఛ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. జూన్ 13 న సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ వివరించారు. జూన్ 14 నుండి 19వ తేదీ వరకు 6 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు అయా పాలిటెక్నిక్ లలో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలోనూ రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు.

జూన్ 14 నుండే రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం అవుతాయని నాగరాణి పేర్కొన్నారు. ర్యాంకు కార్డులను వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సిలింగ్ కు సిద్దంగా ఉండాలన్నారు. మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు.

బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత గడించారు. సమావేశంలో సాంకేతిక విద్య శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, చీప్ క్యాంప్ ఆఫీసర్ విజయకుమార్, ఉపసంచాలకులు విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.