JSURENDER KUMAR ,
దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు కాదని, విలువలు, విశ్వాసాలు, సంస్కృతి సాంప్రదాయాలకు భవిష్యత్ తరాలకు అందించే సంపద అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. అలాంటి దేవాలయాల నిర్వహణను అంతఃకరణ శుద్ధితో చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
దేవాదాయ శాఖ పై మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
తెలంగాణలోని దేవాలయాలను ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, భక్తులకు మానసిక సాంత్వన కలిగించేలా అభివృద్ధి చేయాలని , ఎజెండాలో పేర్కొన్న పలు అంశాల పై సమావేశం ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించింది.
👉ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను సూచించారు. దేవాలయ భూ వివాదాల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, త్వరగతిన పరిష్కారానికి సమర్థులైన న్యాయ నిపుణులను పెట్టుకోవాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
👉ఇప్పటికే దేవాలయ భూములు ఆక్రమణకు గురికాకుండా శాశ్వత పరిష్కారం దిశగా 15,000 ఎకరాల భూములకు జియో ట్యాగింగ్ చేపట్టినట్లు అధికారులు వివరించగా, వీలైనంత త్వరగా దేవాదాయ శాఖకు చెందిన అన్ని రకాల భూములకు జియో ట్యాగింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
👉 లీజుకు ఇచ్చిన దేవాలయ భూములు, దేవాలయ భూముల్లో లీజ్ కు ఇచ్చిన షాపుల వివరాలు, వాటి ద్వారా సమకూరుతున్న ఆదాయం పై మంత్రి సురేఖ ఆరా తీశారు.
👉బకాయిలను వీలైనంత త్వరగా రాబట్టాలని అధికారులకు సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమైదైన దేవాలయ భూముల వివరాలు, ధరణిలో నమోదైన దేవాలయ భూముల వివరాల్లో తేడాలు ఉండటం పై మంత్రి అధికారులను ప్రశ్నించారు.

👉ధరణిలో దేవాదాయ శాఖ భూముల వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవటంతో పాటు, సంబంధిత దేవాలయాల పేరు మీద పాస్ బుక్ లు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
👉 దేవాలయ భూముల్లో ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టడం ద్వారా దేవాలయ భూములకు రక్షణ ఉండటంతో పాటు, దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరుతుందని, ఈ దిశగా ప్రణాళికలు రచించాలని సూచించారు.
👉దేవాలయాల్లో కనీస సదుపాయాల కల్పన పై క్రమం తప్పకుండా చర్యలు చేపట్టాలి. తాగునీరు, టాయిలెట్లు, భక్తులు సేదతీరేందుకు కల్పించే సదుపాయాల్లో ఎలాంటి అవరోధాలు కలగకూడదు. దేవాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. చెత్త నిర్వహణకు మున్సిపాలిటీల సహకారం తీసుకోవాలి. పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే దేవతలు ఆసీనులవుతారు.
👉పరిశుభ్రమైన పరిసరాలు ఉన్నప్పుడే భక్తులు భగవంతుని పై మనస్సును లగ్నం చేసే పరిస్థితులుంటాయి. దేవాలయాల్లో ప్రసాదం అమ్మకాలకు వాడే ప్లాస్టిక్ కవర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వీటితో పాటు పచ్చదనం వెల్లివిరిసేలా దేవాలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి.
👉దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు సెక్యూరిటీ సిబ్బందిని, మెటల్ డిటెక్టర్స్, వాకీ టాకీలు వంటి సామాగ్రిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ప్రముఖ దేవాలయాలన్నీ నిరంతరం సిసి కెమరాల నిఘాలో ఉండాలి” అని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
👉దేవాలయ శాఖ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. దాతల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలు, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాద్ (PRASHAD) పథకం కింద తెలంగాణలోని దేవాలయాల్లో టూరిజం శాఖతో కలిసి చేపడుతుతన్న కార్యక్రమాలు, సిజిఎఫ్, ఎస్డీఎఫ్, ప్రశాద్ స్కీమ్, దాతల విరాళాలు, ఈ నిధులతో చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
👉రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను గుర్తించి, వాటి అభివృద్ధికి కార్యాచరణ రూపొందించటంతో పాటు, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ పలు దేవాలయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను నిరంతరం సమీక్షించాలని అధికారులకు సూచించారు.
👉దేవాలయాలకు సంబంధించిన స్థల పురాణం, దేవాలయ ప్రాశస్త్యం తదితర వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వెబ్సైట్ లో అందుబాటులోకి తెస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి దోహదపడుతుందని, ఆ దిశగా కార్యాచరణను రూపొందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
👉ఈ సందర్భంగా దేవాలయ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కూడా రూపొందించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. సీఎస్ఆర్ (CSR) నిధుల సేకరణకు ప్రత్యేకమైన పోర్టల్ ను అభివృద్ధి చేయాలని సూచించారు.
👉టెండర్లను అత్యంత పారదర్శకతో చేపట్టేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, ఇతర వస్తువులను మార్కెట్ ధరలకు మించి అమ్ముతున్న వార్తలను తన దృష్టికి వచ్చాయని, ఇప్పటికే పలువురు అధికారుల పై చర్యలు చేపట్టామని, ఇందుకు బాధ్యులైన వ్యక్తుల పై ఆరోపణలు వాస్తవమని తేలితే వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ అధికారులను హెచ్చరించారు.
👉రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ధార్మిక సంస్థల్లో జరుగుతున్న వ్యవహరాల పై అధికారులు వాట్సప్ గ్రూపుల్లో నిరంతరం చర్చిస్తూ, వ్యవస్థను గాడిలో పెట్టాలని అన్నారు. దేవాలయాలు, దేవాదాయ శాఖ అధికారుల పై వచ్చే వ్యతిరేక కథనాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
👉దేవాదాయ శాఖ అధికారులు జూమ్ మీటింగ్స్ ద్వారా నిరంతరం దేవాదాయ శాఖ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించారు.
👉 బోనాల పండుగ…
ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని, బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పనను సకాలంలో చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. నదీ తీరాల్లో కొలువైన దేవాలయాల్లో జలహారతి, శంఖనాదం వంటి ఆధ్యాత్మిక శోభను పెంచే కార్యక్రమాలను చేపట్టే విషయాన్ని పరిశీలించాలని మంత్రి అధాకారులకు సూచించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, డిప్యూటీ కమిషనర్ లు, అసిస్టెంట్ కమిషనర్ లు, ప్రధాన ఆలయాల ఈవోలు, బ్రాహ్మణ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ నర్సింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.