👉నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం!
భూమిపై జీవరాశి మనుగడకు వైవిధ్యం అవసరం. రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక జీవ రాసులు తమ మనుగడను కోల్పోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో రాబందులు కన్పించేవి. జంతు కళేబరాలను తిని వివిధ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేవి. ఇప్పుడవి మనుగడలో లేవు. వీటితో పాటు అనేక జంతువులు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. వీటి ఆవశ్యకతను తెలియజేయడానికి మే 22 తేదీని అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా, 2010లో అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 యొక్క అధికారిక థీమ్ “ప్రణాళికలో భాగం అవ్వండి ”సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఆక్టివిజమ్ (సిఇఎ), సొసైటీఫర్ హ్యూమన్ అవేర్‌నెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (షార్డ్), అట్లాంటా ఫౌండేషన్ ,మన దేశంలో ప్లానెటరీ సొసైటీఆఫ్ ఇండియా సహకారంతో జీవవైవిధ్యానికి సంబంధించిన కార్యక్రమాలునిర్వహించబడుతున్నాయి. భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిధ్యం’ అంటాం.
మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి.
పల్లెలలో వాటికోసం ధాన్యపుకంకులు ప్రతీఇంటా వేలాడదీసేవారు. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు విలుప్తమైపోయాయి.
విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.
వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది.
అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.
మన దేశంలో ఆదివాసులు ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం.
ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇటీవల సౌదీ అరేబియా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. జీవ వైవిధ్యం ఉండాలంటే కనీసం భూమిపై 33శాతం అడవులు ఉండాలి. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి.
వ్యాసకర్త : యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492712836