👉టెంపుల్ సిటీ ధర్మపురి పట్టణంలో విద్యుత్ శాఖ తీరే వేరు!
👉మరమ్మత్తుల పేరిట కరెంట్ కట్ !
👉పాడి పరిశ్రమ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు పడరాని పాట్లు!
👉వినియోగదారుల ఫోన్లకు విలువ ఇవ్వని అధికారులు !
👉అమలుకు నోచుకోని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రంగా, నియోజకవర్గ కేంద్రంగా టెంపుల్
సిటీగా, ప్రసిద్ధిగాంచిన ధర్మపురి పట్టణంలో విద్యుత్ శాఖ
ఇష్టానుసారంగా పవర్ కట్ చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను
దిగజారుస్తున్నారా ? లేక సాంకేతిక సమస్యతోనే సప్లై నిలిపి
వేస్తున్నారా ? అనే అంశంలో విద్యుత్ వినియోగదారులకు
అర్థం కావడం లేదు. ఫీడర్లు, సబ్ స్టేషన్ ల లో మరమ్మత్తులు
చేపడుతున్నామంటూ పట్టణం తో పాటు, అనేక గ్రామాలలో
కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు .
నెల రోజుల కాలంలో దాదాపు నాలుగు, ఐదు సార్లు మరమ్మత్తుల పేరిట విద్యుత్ సరఫరా ఉండదు అంటూ, సోషల్ మీడియాలో సంబంధిత శాఖ వారు పోస్ట్ చేయడం షరా మామూలుగా మారింది. వినియోగదారులు తమ అవసరాలు, ఏదేని సమాచార నిమిత్తం సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసినా, స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమకు త్రీఫేస్ విద్యుత్తు కనెక్షన్ కోసం గత రెండు సంవత్సరాలుగా రైతు సంబంధిత అధికారుల, కార్యాలయలల చుట్టూ తిరుగుతున్నాడు. మీ శాఖ నిబంధనల మేరకు మీరు కోరిన మొత్తం బ్యాంకులో డిడి రూపంలో చెల్లిస్తాను, మీ శాఖ నియమ నిబంధనలో మేరకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వండి అంటూ రైతు అభ్యర్థించిన, ఆవేదన వ్యక్తం చేసినా అధికారుల ముందు అరణ్య రోదనగా మారిందే తప్ప, ఈనెల 20 నాటి వరకు రైతుకు త్రీఫేస్ విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు.
👉వివరాల్లోకి వెళ్తే..
ధర్మపురి పట్టణంలో విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఉంది. 33 కేవీ , 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లు ఉన్నాయి. సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురి, నేరెళ్ల, వెలుగటూర్, రాజారం పల్లె విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉన్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిరంతర విద్యుత్తు కోసం ప్రత్యేక కేబుల్ సౌలభ్యం ఉండేది. కారణమేదో తెలియదు కానీ గత రెండు సంవత్సరాలుగా నిరంతర విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
👉మరమ్మత్తు పనుల పేరిట…..
ఫీడర్ చానల్స్ , బ్రేకర్స్ మరమ్మత్తుల పేరిట టెంపుల్ సిటీ ధర్మపురికి, మండలంలోని పలు గ్రామాలకు 15 రోజులకు ఓసారి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు.
👉రెండు రోజులకే మరమ్మత్తు పనుల వాటి మర్మమేమిటో.?

ఈనెల 26 న పట్టణంలోని 11 కేవీ సబ్ స్టేషన్ లో బ్రేకర్ మరమ్మతు పనుల నేపథ్యంలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు ప్రకటన జారీ చేశారు.
ఇదే నెల 28 న 11 కేవీ సబ్ స్టేషన్ లో బ్రేకర్ మరమ్మత్తుల వలన పట్టణంలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదంటూ పోస్ట్ చేశారు. ఈ మరమ్మత్తు పనుల మర్మం ఏమిటో తెలియక వినియోగదారులు. విలవిలలాడుతున్నారు.

👉ఇది ఇలా ఉండగా….

ఇదే రోజున ( 28 /5/2024 ) 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో జైన, ఫీడర్ మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో, జైన, నక్కల పేట, దోనూర్, సబ్ స్టేషన్ పరిధిలో దొంతపూర్, డొంకేశ్వరం , మగ్గిడి, ఎడపల్లి, రాజారాం, దమ్మన్నపేట, జైన, కోసునూరు పల్లె, తీగల ధర్మారం, దుబ్బల గూడెం, తదితర గ్రామాలలో విద్యుత్ సరఫరా కొన్ని గంటలపాటు ఉండదని ముందస్తుగా పోస్ట్ చేశారు.
తిరిగి ఇదే రోజున 33 కేవీ, 11 కేవీ సబ్ స్టేషన్లలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మత్తు పనులు చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయా ? ఈ మరమ్మత్తు పనులు శాఖ పరంగా చేపడుతున్నారా ? ప్రైవేట్ కాంట్రాక్టర్ చేస్తున్నాడా ? రెండు విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమత్తు పనులు చేసే సిబ్బంది ఉన్నారా ? అనే అంశం అధికారులు చెప్పాల్సి ఉంటుంది.
👉నరసింహ జయంతి రోజు పవర్ కట్ ?

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి పర్వదినం ( 21/05/2024 ) సందర్భంగా భారీ సంఖ్యలో భక్తజనం ఆలయానికి తరలి వస్తుంటారు. క్షేత్రంలోనీ పలువురు ఇండ్లలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మరమ్మత్తుల పేరిట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందంటూ సంబంధిత శాఖ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

👉 కనెక్షన్ కోసం పాడి రైతు పడరాని కష్టాలు !
మండలంలోని ఓ రైతు కుటుంబ సభ్యులు వ్యవసాయ అనుబంధం పాడి పరిశ్రమ నిర్వహిస్తుంటారు. వారికి సింగిల్ ఫేస్ విద్యుత్ కనెక్షన్ ఉంది. పశుగ్రాసం కట్ చేయడం కోసం త్రీఫేస్ విద్యుత్ కనెక్షన్ అవసరం ఉంది. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు త్రీఫేస్ కనెక్షన్ కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తాను, నాకు త్రీఫేస్ కనెక్షన్ ఇవ్వండి అంటూ గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మీ పేరిట సింగిల్ ఫేస్ కనెక్షన్ ఉండగా , త్రీఫేస్ కనెక్షన్ ఇవ్వరాదు అంటూ ఓ సారి, మరోసారి ఏడి ని అడగాలి అని, మరోసారి డి ఈ అనుమతిస్తే కావాలి అంటూ, మరోసారి వరంగల్ నుంచి పర్మిషన్ రావాలి అంటూ ఆ రైతును అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప, త్రీఫేస్ కనెక్షన్ ఇవ్వడం లేదు. సింగిల్ ఫేస్ పై పశుగ్రాసం యంత్రం వినియోగిస్తున్నాడని ఆ శాఖ విజిలెన్స్ అధికారులు పాడి పరిశ్రమ పై దాడి చేసి ఓసారి ₹ ,70 వేలు, మరోసారి ₹ 30 వేలు రైతుకు జరిమాన విధించారు.
ఇదే జిల్లాలో పోరండ్ల, పెంబట్ల కోనాపూర్, బట్ట పెళ్లి గ్రామాలలో పాడి పరిశ్రమకు త్రీఫేస్ కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. రైతు కుటుంబంలో ఒకరు పాడి పరిశ్రమ సంఘం జిల్లా కమిటీ సభ్యుడైన వీరికి మాత్రం ధర్మపురి విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ ఇవ్వకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

👉వినియోగదారుల ఫోన్లు ఆన్సర్ చేయరు !

విద్యుత్ వినియోగదారులు ఆ శాఖకు చెల్లిస్తున్న లక్షలాది రూపాయల సొమ్ముతో నెల నెల వారు జీతాలు పొందుతూ జీవనం కొనసాగిస్తున్న, ఆ శాఖ ధర్మపురి అధికారులు, ఏదైనా అవసర, సమాచార నిమిత్తం, వినియోగదారులు అధికారులకు ఫోన్ చేస్తే. వాళ్లు ఎత్తరు, ఫోన్ ఎత్తి, జవాబు చెప్పిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కించవచ్చు. 33 కేవీ,11 కేవీ విద్యుత్ సబ్ సబ్ స్టేషన్ ల ఫోన్ నంబర్లు 90% వినియోగదారులకు తెలియదు. ఆ నెంబర్లు పట్టణంలో, గ్రామాలలో ,ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే ఏదైనా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయండి, అంటూ సమాచారం ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని వినియోగదారుల ఆవేదన. వ్యవసాయ విద్యుత్తు, గృహ నిర్మాణాల, వాణిజ్య విభాగాలకు కనెక్షన్ పొందుటకు వాటి వివరాలు, ఎలా దరఖాస్తు చేయాలి ? ఎవరిని సంప్రదించాలి ? అనే సమాచారం విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆగుపించదు. ఇట్టి వివరాలు వివరించే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరు.

👉లాగ్ బుక్ తనిఖీ చేస్తే…
సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ తనిఖీ చేస్తే, ఓవర్ లోడ్ (O.L). ఎర్త్ లోడ్. (E.L) విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏ సమయానికి ట్రిప్ అయింది. ఎప్పుడు వచ్చింది, ఆపరేటర్ L.T ఎప్పుడు తీసుకున్నారు ? ఏ అవసరాల నిమిత్తం తీసుకున్నారు ? అనే అంశం గంటలు నిమిషాలతో లాగ్ బుక్ లోనమోదు చేస్తుంటారు. ప్రతి గంటకు సబ్ స్టేషన్ లో ఆపరేటర్ ఏ ఫీడర్ పై ఎన్ని యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది అనే యూనిట్ల రీడింగ్ వివరాలు నమోదు చేస్తుంటారు.
👉అమలుకు నోచుకోని సీఎం ఆదేశాలు.!
ఐదు నిమిషాలకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడితే సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిస్థితి సమీక్షించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు ధర్మపురి లో అమలు కావడం లేదు. 15 రోజులలో రెండు, మూడు సార్లు గంటల తరబడి విద్యుత్తు అంతరాయం కలిగిన అధికారులు మాత్రం స్పందించడం లేదు. పరిస్థితిని సమీక్షించడం లేదు రికార్డులలో నమోదు చేయడం లేదు.
👉సీఎం సమీక్షలో…
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫిబ్రవరి చివరి వారంలో గృహజ్యోతి, అర్హులైన లబ్ధిదారులకు ఎల్ పి జి సిలిండర్ కు ₹ 500 సరఫరాపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నియమించబడిన క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం లో “అత్యుత్సాహం” ప్రదర్శించారని ఆయన అన్నారు. ఐదు నిమిషాలకు పైగా విద్యుత్తు అంతరాయం ఏర్పడితే సంబంధిత అధికారులు వెంటనే పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే లా విద్యుత్ సరఫరా పై స్వార్థ ప్రయోజనాలు కల్పించి భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తనకు నివేదికలు అందాయని, అలాంటి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
👉 గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగింది !
(సీఎం ఓ కార్యాలయ గణాంకాలు ఇలా )
రాష్ట్రంలో సగటు రోజు వారీ 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంది, అయితే గత రెండు వారాలుగా 14,000 మెగావాట్ల నుండి 15,000 మెగావాట్ల వరకు గరిష్ట డిమాండ్ ను ఎదుర్కొంటోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జనవరి నుండి మార్చి, 2023 వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయబడింది.
2024 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కాలంలో సగటున రోజుకు 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయబడింది.
గతేడాది మార్చి 14 న అత్యధికంగా 297.89 మిలియన్ యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాదితో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో విద్యు త్ సరఫరా మెరుగుపడింది.
👉డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్తు !
డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి – ఏప్రిల్ మాసంలో నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం అమలు చేసింది. ఫిబ్రవరి 1 – 13 మధ్య కాలంలో 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది, గత ఏడాది ఇదే కాలంలో 242.44 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. అదేవిధంగా, ఈ ఏడాది జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, గత ఏడాది ఇదే నెలలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయబడ్డాయి అని సీఎం కార్యాలయంలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
విద్యుత్ శాఖ జిల్లా ఉన్నతాధికారి జోక్యం చేసుకొని ధర్మపురి విద్యుత్ సబ్ స్టేషన్ ల మరమ్మత్తు పనులు, విద్యుత్ వినియోగదారుల ఫోన్లు కు అధికారులు స్పందించకపోవడం. పాడి పరిశ్రమ రైతుకు త్రీఫేస్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం తదితర అంశాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని విద్యుత్ వినియోగదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.