రాజీ మార్గమే రాజా మార్గం సుప్రీంకోర్టు నినాదం జగిత్యాల్ కోర్టు ఆచరించింది !

👉నాలుగు దశాబ్దాల వివాదం పరిష్కరించింది !


J.SURENDER KUMAR,

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పలు న్యాయస్థానంలో కొనసాగుతున్న వారసత్వ ఆస్తి వివాదం గురువారం జగిత్యాల కోర్టులో వారసుల సమ్మతితో న్యాయవాదులు, న్యాయమూర్తి, వారసుల రక్తసంబంధికులు సమక్షంలో వివాద రహితంగా పరిష్కారం జరిగింది. రాజీ మార్గమే రాజమార్గం అనే సుప్రీంకోర్టు నినాదం అక్షర సత్యాలుగా జగిత్యాల్ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకున్నారు. దీంతో దాదాపు 43 సంవత్సరాలుగా కొనసాగిన న్యాయవివాదం కు తెరపడింది.
వివరాలు ఇలా ఉన్నాయి.


జగిత్యాల పట్టణం కు చెందిన రుద్రంగి నరసయ్య తన తండ్రి స్థిర, చర ఆస్తుల పంపకాల అంశంలో తన సోదరులు రుద్రంగి రాజన్న, రుద్రంగి విశ్వనాథం పై 1981 లో కరీంనగర్ కోర్టులో కేసు వేశారు. జగిత్యాల కోర్టు ఏర్పడిన తర్వాత ఆ కేసును ఇక్కడికి బదిలీ చేశారు. గత 43 సంవత్సరాలు కేసు కొనసాగుతుండగా రుద్రాంగి నర్సయ్య సోదరులు, రాజన్న, విశ్వనాథం లు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో (93) సంవత్సరాలు వయస్సు గల రుద్రంగి నరసయ్య, తన సోదరుల వారసులతో రాజీకి అంగీకరించారు. రుద్రంగి విశ్వనాథం, రాజన్న వారసులు, గురువారం జడ్జి ప్రాంగణంలో ప్రశాంత, స్నేహపూర్వక వాతావరణం లో రాజీ పడ్డారు.

నరసయ్య పక్షాన మిట్ట మహేందర్, విశ్వనాథం పక్షాన, న్యాయవాది మురళీధర్ రావు, రాజన్న పక్షాన న్యాయవాది సుబ్రహ్మణ్యం లు, జగిత్యాల సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ కే. ప్రసాద్ సమక్షంలో సంతోషంగా రాజీ కుదుర్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల గా న్యాయస్థానంలో కొనసాగిన వివాదంకు గురువారం శుభం కార్డు పడింది.