రాష్ట్ర ఆవిర్భావ వేడుకను ఆత్మగౌరవ ప్రతీకలా నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు!

👉 దశాబ్ద కాలంలో మోనోపాలీకి భిన్నంగా వేడుకలకు రంగం సిద్ధం..

👉 ఉద్యమకారులకు పెద్దపీట…

👉 ఆడంబరాలకు దూరంగా ఉద్యమ మూలాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు…


J.SURENDER KUMAR,

ప్రత్యేక రాష్ట్రంగా స్వాతంత్ర్యం వచ్చి దశాబ్ద కాలమైనా..

ఆ కాలమంతా మోనోపాలీ గా నియంతృత్వమే

రాజ్యమేలిందా..? పదేళ్ళ బీఆర్ఎస్ పాలన

అంతమైతేనేగానీ… వచ్చిన స్వాతంత్ర్యానికి స్వేచ్ఛ

లభించలేదా..? పదేళ్ళ తర్వాత జరుగబోతున్న తెలంగాణా

ఆవిర్భావ వేడుకలు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో

ఆత్మగౌరవానికి ప్రతీకగా యావత్ తెలంగాణం భావిస్తోందా.?

ఇదేదో బీఆర్ఎస్ ను తగ్గించేందుకో.. కాంగ్రెస్ ను భుజానికెత్తుకుని భాజాభజంత్రీలు వాయించేందుకో కాదు… వరుసగా వస్తున్న ఎన్నికలో.. నాటి బీఆర్ఎస్ పాలనలో ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడమోగానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెల్లైనా నాడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తానెలా అధిగమించా లో తెలియని ఓ మీమాంసలో ఉంది.

అంతేకాదు… ఒక్క మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం మినహా.. కాంగ్రెస్ పథకాలు కొన్ని అమలవుతున్నా.. వాటిని ప్రచారం చేసుకునే విషయంలోనూ.. ప్రజాదరణ విషయంలోనూ ఇంకా ప్రోయాక్టివ్ గా కనిపించడం లేదు. మొత్తంగా పెద్ద రంజిపజేసే పాలనని గట్టిగా బల్ల గుద్ది జనం ఇప్పటికిప్పుడు చెప్పే అవకాశమైతే ఇంకా రాలేదు. అయినా.. కాంగ్రెస్ పై జనంలో ఇంకా విముఖత మాత్రం ఏర్పడటం లేదు. కారణం, నాటి బీఆర్ఎస్ మూటగట్టుకున్న పాపాలు!

👉 గుణపాఠం నేర్పని నియంత చరిత్రలు!

ఒకటా, రెండా..? వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నియంతృత్వాలు చరిత్రలో ఎలా ఉండేవో.. వర్తమానంలో తెలంగాణాకు అనుభవపూర్వకం చేసింది బీఆర్ఎస్ పాలన. ఊళ్లలో చోటామోటా నాయకులు మొదలు.. కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి రాష్ట్ర నాయకుడి వరకూ.. ఎవరికి వారే నియంతలుగా వ్యవహరించిన కాలపు అనుభవం ముందు.. ఇప్పుడు కాంగ్రెస్ ఏమీ చేయకపోయినా బాధ పడని, ఊరట స్థితికి తెలంగాణా ప్రజానీకం వచ్చిందంటే.. ఎంత పెయిన్ ఉండి ఉండాలి..?

అందుకే ఇప్పుడు పదేళ్ల తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగబోతున్న తెలంగాణా ఆవిర్భావ వేడుకలను.. చాలామంది సిసలైన ఆత్మగౌరవంగా భావిస్తున్న సమయమేమో బహుశా ?

👉 అహంకారపు సామ్రాజ్యవాదానికి స్వస్తి ..

నాటి దొరలు, భూస్వామ్య వ్యవస్థ నుంచి తాడిత, పీడిత జనాన్ని రక్షించేందుకే.. ఎప్పటికీ మర్చిపోలేని జగిత్యాల జైత్రయాత్ర వంటివి పుట్టుకొచ్చాయి. నక్సల్ బరి నుంచి వలస వచ్చిన మావోయిస్టు ఉద్యమం తెలంగాణాలోనూ వేళ్లూనుకుంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రంతో తెర పడ్డట్టు.. బీఆర్ఎస్ ఓటమి అనంతరం కాంగ్రెస్ రాకతో నూతన తెలంగాణా రాష్ట్రంలోనూ ఆ స్వేచ్ఛా వాయువులు జనం పీల్చుకుంటునట్టు గోచరిస్తోంది.


ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవడం వివేకవంతుడి లక్షణం. కానీ, అవసరం లేని చోట కూడా అవకాశాలు సృష్టించి.. ఏమీ లేకుండానే మసిపూసి మారేడుగాయి చేసి.. బట్ట కాల్చి మీద వేసి.. అబద్ధాలను ప్రచారం చేసి.. దొంగే దొంగ, దొంగ అని మొత్తుకున్నట్టు.. ఇతరులంతా సన్నాసులు.. తాము మాత్రమే శుద్ధపూసలమనే వాదనను వినిపించినంత మాత్రాన జనం నమ్మరా మరి..? ఏ జనం కోసమైతే తెలంగాణా కోరుకున్నామన్నారో.. ఆ జనమే ఛీత్కరించుకునే స్థాయికి దిగజారడం.. వివేకవంతుడు తెలివి మీరి అతి తెలిమిమంతుడైన వైనాన్ని కళ్లకుగట్టడం లేదూ..?

👉 ప్రశ్నించే గొంతుకలకు నొక్కేసిన నియంతృత్వం…

నాడు 1978లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక జగిత్యాల జైత్రయాత్రైనా.. తుపాకీ గొట్టం ద్వారానే బలహీనులకు న్యాయం జరుగుతుందన్న అన్నల ఉద్యమాల వెనుకైనా… అంతెందుకు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు జరుగుతున్న వివక్షపైనా… ఇలా ఏ ఉద్యమం వెనుకైనా ప్రశ్నే బలమై నిల్చింది. కానీ, బీఆర్ఎస్ పాలనలో ఆ ప్రశ్నే చచ్చిపోయింది. ప్రశ్నించే తత్వాన్ని నూరిపోసిన ఉద్యమనేతే… తానధికారం చేపట్టాక ఆ ప్రశ్ననే గొంతు నులిమేశాడు.

తన సర్కారుకెదురుగా ఎవ్వరూ అరవొద్దని… హైదరాబాద్ లో ఎందరో నిరసనకారులకు అడ్డాగా మారిన ధర్నా చౌక్ నే ఎత్తేశాడు. మీడియాను బొంద పెడతానన్నాడు. ఎవరైనా ప్రశ్నలడిగినా ఓర్చుకోలేకపోయాడు. తాన అంటే తందాన అనే వారే తన దగ్గరుండాలనే వైఖరి.. అలా అన్నవాళ్లను మరోవైపు పూచిక పుల్లతో తీసేసే గుణం… వెరసి కేసీఆర్… అంతకుమించి అణువణువునా ఆయన ప్రతిబింబపు పాలన!

👉 నాటి పాలనలో ఉద్యమకారులకు చోటేది..?

ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా తెలంగాణా ప్రాంతంపై జరుగుతున్న వివక్ష నేపథ్యంలోనే కదా.. నాడు ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్ధన్ రావు, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి ప్రజాస్వామికవాదులంతా సకల జనుల సమ్మెకు సై అంది..? 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ వెంట నిల్చింది !


కానీ, కేసీఆర్ గద్దెనెక్కాక వారెవ్వరి జాడైనా ఈ తెలంగాణా ప్రజానీకం కనుగొందా..? వారెప్పుడైనా కేసీఆర్ తో భేటీ అయిన దాఖలాలు చూశారా..? నాడు ఉద్యమకాలంలో వెంటుండినవారు… నూతనంగా ఏర్పడిన తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చే క్రమంలో ఇచ్చే సలహాలను ఏనాడైనా కేసీఆర్ ఆచరించడం అటుంచితే.. .కనీసం వినే యత్నం చేశారా..? వినకపోతే వినకపోని… కనీసం దగ్గరకు రానిచ్చాడా…?

👉 నిజాం పాలనలో రజాకార్లను తలపించేలా ఆకృత్యాలు…

నిర్బంధాలు.. తలుపులు పగులగొట్టి ఇళ్లల్లోకి రజాకార్ల తరహాలో పోలీస్ ప్రవేశాలు.. తనకెదురనుకున్నవారివి… తాను అనుమానించేవారివి ఫోన్ ట్యాపింగ్స్… మొత్తంగా ఒక రాజకీయ వికృత క్రీడను నూతన తెలంగాణా రాష్ట్రం కళ్లజూసింది.

వైట్ ఎలిఫెంట్ వంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో.. అప్పుల్లో కూరుకుపోయింది. కమీషన్ల పేరిట.. అధికారంలో ఉన్నవారు ఎలా మెక్కుతారు… ఎంతటి విలాసాల్ని అనుభవిస్తున్నారో కళ్లను మరింత పెద్దవి చేసి చూసిందీ.. ఇదే తెలంగాణ. పైగా తెలంగాణా అంటే అప్పటివరకూ సకల జనులు, విద్యార్థుల ఆత్మబలిదానాలు, లాఠీదెబ్బలు, పోలీస్ కేసులున్నవారంతా పక్కకుపోయి..

తెలంగాణా అంటే కేసీఆర్.. ఆయన కుటుంబం.. కేసీఆర్ అంటే తెలంగాణా అనే ప్రచారాన్ని సిగ్గూ, ఎగ్గూ వదిలేసి చాలా సమర్థవంతంగా చేసుకుని.. ఉద్యమ నిర్మాణానికి కష్టించినవారి కథ కనుమరుగు చేసి… ఉద్యమసారథిగా తన పేరును నిలుపుకునే ప్రయత్నాలను ఈ సమాజం గమనించలేదనుకుంటే.. ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ.. విషయాన్నింకా సరిగ్గా గ్రహించలేదన్నట్టే లెక్క!

👉 చరిత్రలో మరో నియంతగా పేరు..

కుటుంబీకులకే పదవులు… అధికారమంతా వారి కనుసన్నల్లోనే నడుస్తూ కేంద్రీకృతమైన పాలన… సామాన్య ప్రజానీకానికి దొరకని నాటి మాజీ ముఖ్యమంత్రి దర్శనం… సారీ సారీ, ఎమ్మెల్యేలు, మంత్రులకే లభించన మోక్షం… వెరసి, ప్రజాస్వామ్య పాలనపై అదంతా కేసీఆర్ మార్క్ నియంతృత్వం కాదా..?

సారెలాగూ తమనకు కలవడు. అలాగని, తామేమన్నా గ్రామాల్లో చేసినా.. సారు మనల్ని ఏమీ అనడు. అవసరమైతే వెనుకేసుకొస్తాడు, కాపాడుతాడు కూడాను. ఇదిగో ఈ భావనే… సారులాగే గ్రామగ్రామాన అంతరించిన కరణాల వ్యవస్థను కళ్ల ముందుంచింది. రెవెన్యూ, ఎక్సైజ్, ఫారెస్ట్, మైనింగ్, మున్సిపల్, పంచాయితీ.. వాట్ నాట్ అన్నట్టుగా ప్రతీ చోటా అధికారులు వంతపాడటం.. అధికారపార్టీ నాయకులు తామనుకున్న రీతిలో పనులు చేయించుకోవడం.. ఆ క్రమంలో ఎందరో అమాయకుల బలి.. మొత్తంగా అప్పటివరకూ వానపాముల్లా బతికినవారు.. అధికారంలోకి రాగానే కాలనాగులై బుసలు కొట్టిన వైనాన్ని తెలంగాణాం మర్చిపోగలదా..?

👉 మాటల గారడీ మాత్రమే నిరంతం నడిపిస్తుందా..?

కేసీఆర్ మాటల చాతుర్యాన్నీ, ఆయన కుటుంబీకులకు అబ్బిన ఆ మాటలగారడీని చూసి చాలామంది.. ఇంతకంటే బెటర్ ఎవరున్నారనే చర్చ చేసిన వైనం కూడా చూశాం. అసలు ఫీల్డ్ లోనే ఎవ్వడూ లేక… ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనమై బిక్కచచ్చుకుపోయే రీతిలో ఉన్నప్పుడు… కేసీఆర్ లాంటివాడే బలవంతుడనిపిస్తాడు.

ఆయన కుటుంబ పాలనే రంజిపజేస్తుంది. అప్పుడతనే బాహుబలి అవుతాడు. పైగా విచ్చలవిడిగా మీడియా ప్రబావానికి లోనయ్యే గొర్రెధాటి జనానికి… ఆహా, ఓహోలు తప్ప… ఇన్ డెప్త్ అనాలిసిస్ ఎక్కడిది..? ఇదిగో ఇలా ప్రతీ పాయింట్ నూ ఎన్ క్యాష్ చేసుకునే క్రమంలోనే.. కేసీఆర్ అత్యాశ, అహంకారం.. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు.. ఇప్పుడు ఆయన్ను కనిపించకుండానే కాదు… ఇక కొద్దిరోజులకు వినిపించడం కూడా జరగదేమోనన్నంత సంక్షోభాన్ని ఆయన ముందుంచింది.

👉 అహం బ్రహ్మాస్మి !

అహం బ్రహ్మాస్మీ అన్నట్టుగా… సీటెక్కగానే తనంతటివాడు లేడనుకుని… సీట్లే కాదు.. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన ఎందరో నియంతల పాఠాలు చదవలేదా… మరి కేసీఆర్ అంతటి చదువరి..? చదివినా… అధికార అహం కమ్మేసిన మైకంలో అలాంటివి గుణపాఠాలని భావించాల్సిన వేళ.. అవే తప్పులను పునరావృతం చేస్తూ తానూ అలాంటి జాబితాలో చేరిపోవడం మాత్రం మనమెరిగిన కేసీఆర్ ను చూసినప్పుడు ఒకింత బాధ కూడా వేసేదే!

అయితే, కాలమెప్పుడూ మన కోసం ఆగదు. దాని వెంట మనం పరిగెత్తుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రజాస్వామ్యవాదులైతే ప్రజల మనసులెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. కానీ, మితిమీరిన అహంకారం తలకెక్కి కన్నూమిన్నూ కానని బిరుసుతో.. బీఆర్ఎస్ అపజయాన్ని చవిచూసింది. మఖలో పుట్టి పుబ్బలో కలిసే పార్టీలంటూ తరచూ ఉద్యమకాలం నుంచి చెప్పుకొచ్చిన కేసీఆర్.. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలతో తన పార్టీని ఎలా కాపాడుకుంటారన్నదీ ఓ పెద్ద సవాలే!

👉 కాంగ్రెస్ కు గెలుపుకు వరమైన ప్రభుత్వ వ్యతిరేకత!

ఇక ఆ విషయాన్ని కాస్సేపు వదిలేస్తే.. జనజాతరతో దాదాపు మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టి… కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులు పొంది ఏకంగా ముఖ్యమంత్రయ్యాడు.

తామిచ్చిన ఆరు గ్యారంటీల కన్నా ఎక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో గెల్చాడు. అయితే, ఆ గెలుపును తనకనుకూలంగా మల్చుకుంటాడా…? సమయానుకూలంగా… సమయస్ఫూర్తిగా వ్యవహరించి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడా..? తనకెదురైన సవాళ్లను ఓపికతో, పరిణతితో అధిగమిస్తాడా…?

మొత్తంగా… తన మార్క్ ను సృష్టించగల్గుతాడా అన్నవి అంతా ఎదురు చూస్తున్న ప్రశ్నలు…?అయితే, రేవంత్ నేతృత్వంలో దశాబ్ద కాలమనంతరం జరుగబోతున్న ఈ జూన్ 2 తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం మాత్రం.. స్వేచ్ఛా వాయువులూదిన తెలంగాణా అసలైన ఆత్మగౌరవ దినంగా మాత్రం జనంలో ఓ చర్చ జరుగుతుండటం కనిపిస్తోంది!