ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రజలు ఆశించిన మేరకు చేస్తుంది !

👉 మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి!


J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
రాష్ట్ర సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్థులో బుధవారం కుటుంబ సభ్యులతో పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాంఘిక సంక్షేమ, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ, గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి అన్నారు.


ప్రకాశం జిల్లా శింగరాయకొండలో ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల సంస్థ ఆధర్యంలో నడుస్తున్న డా. బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ గ్రూప్ సి.ఈ.సి ( 80 సీట్స్ ) తోపాటు ఎం.పి.సి 40 సీట్స్, బైపీసి 40 సీట్స్ అదనంగా మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద బాపట్ల జిల్లా నాగులపాలెం బాలికల గురుకుల విద్యాలయంలో పాఠశాల కు సరఫరా చేయబడిన కూరగాయలు, పండ్లు, గ్రుడ్లు మొదలగు సామగ్రి తాజాగా విద్యార్థులకు అందించేందుకు అనువుగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ను మంజూరు చేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు వేడి నీటిని అందించేందుకు పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్ సౌకర్యం కూడా కల్పిస్తూ మూడు ఫైల్స్ పై మంత్రి సంతకాలు చేశారు.


ఈ రెండు పైలట్ ప్రాజెక్టుల ఫలితాల ఆధారంగా రాష్ట్రమంతా వీటిని విస్తరింప చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
షెడ్యూలు తెగలకు చెందిన విద్యార్ధులకు ఫీజులు మంజూరు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ శాఖగా పనిచేస్తుంది అన్నారు. ఆగిపోయిన ఫీజు బకాయిలను చెల్లించడానికి బడ్జెట్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.


2023-24 సంవత్స్రానికి వివిధ పథకాలు ద్వారా ఉన్న బకాయిలను విలేకరులకు మంత్రి వివరించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల పథకం క్రింద మొత్తం ₹2,505.56 కోట్లు ఉండగా ఎస్.సి విద్యార్ధులకు ₹131.82 కోట్లు; వసతి నిర్వహణ రుసుము క్రింద బకాయిలు మొత్తం ₹895 కోట్లు ఉండగా ఎస్.సి విద్యార్ధులకు ₹.90.00 కోట్లు; హాస్టల్ బిల్స్ మొత్తం ₹.20.71 కోట్లు; పి.ఎం.ఈ.జి.వై పథకం క్రింద ₹ 62.30 కోట్లు; ఎన్.టి.ఆర్. విద్యోన్నతి పథకం క్రింద మొత్తం ₹.1.99 కోట్లు; అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం క్రింద ₹.5.69 కోట్లు; బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం క్రింద ₹ 60.10 కోట్లు; ఎస్సీ.ఎస్టీస్ చట్టం మానిటరీ రిలీఫ్ , కులాంతర వివాహాల (ఎస్సీస్) కొరకు మొత్తం ₹.21.87 కోట్లు స్థూలంగా అన్ని పథకములకు విడుదల కావలసిన మొత్తం ₹.3,573.22 కోట్లు అని, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీకి చెందిన బిల్లులు 2019-24 వరకు మొత్తం ₹.243.34 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు.


సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని, వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడమే కాకుండా, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని, వయో వృద్ధుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.


విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, గ్రామ వార్డు, సచివాలయాల ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. హర్ష వర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలతో అభినందనలు తెలియజేశారు.