👉 జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ ఎపిసోడ్ లో..
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అచేతనవస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆకాశం అంతా ఎత్తుకు ఒంటి చేత్తో ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికలో చిన్న పాటి లాజిక్ మార్చారా ? లేక సీఎంను మిస్ లీడ్ చేశారా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
2023 లో జగిత్యాలలో జరిగిన ఎన్నికల సభ, రాహుల్ గాంధీ రోడ్ షోలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం.రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గూర్చి మాట్లాడుతూ, మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు నిర్వహించిన సామాన్యుడిగా ఆయన జీవన విధానంకు నిదర్శనం అన్నారు. ఆయన ఇల్లు, తాతల నాటి కర్ర కుర్చీలు, టేబుల్, హంగు ఆర్భాటం లేని జీవనం జీవన్ రెడ్డిది అని అన్నారు. జీవన్ రెడ్డిని మహారాష్ట్ర నాయకుడు శరధ్ పవర్ తో రేవంత్ రెడ్డి పోల్చారు, జీవన్ రెడ్డి పట్ల తనకు ఉన్న అభిమానం, గౌరవాన్ని బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇంత అభిమానం జీవన్ రెడ్డి పట్ల ఉన్న రేవంత్ రెడ్డి సంజయ్ అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
కెసిఆర్ ప్రభుత్వాన్ని చాలెంజ్ చేసి ఓడించిన రేవంత్ రెడ్డి, సంజయ్ చేరిక అంశం ముందస్తుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చెప్పలేదా ? లేక సంజయ్ చేరికకు ప్రణాళిక రూపొందించిన నాయకులు, తాము సంజయ్ చేరిక విషయం జీవన్ రెడ్డికి వివరించామని చెప్పి రేవంత్ రెడ్డిని మిస్లిడ్ చేశారా ? అనే చర్చ నెలకొంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయా ? అనే చర్చ సైతం జరుగుతున్నది.

నాటి కెసిఆర్ ప్రభుత్వ రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ రథసారథి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ చేరిక సమాచారం ఇవ్వడంలో ఎందుకు గోప్యం పాటించారు ? అనేది ప్రశ్నగా మారింది. సమయం, సందర్భం చేరిక సమయంలో అక్కడ ఉన్నవారు వివరిస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసి అవకాశం లేదు.
👉క్యాడర్ లేకుండా….
రెండుసార్లు జీవన్ రెడ్డి పై గెలిచిన ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కి బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంది. జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, రాయికల్ మున్సిపాలిటీ, బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధుల పుష్కల క్యాడర్ ఉండి ఆదరాబాదరాగా కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరడంలో ఆంతర్యం ఏమిటో ? రాజకీయ వర్గాల్లో అంతు పట్టని ప్రశ్న గా మిగిలింది.
👉ప్రభుత్వ విప్ ను పట్టించుకోలేదు !
నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు వివరణ ఇస్తున్న సంజయ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు సైతం సమాచారం ఇవ్వకుండా, సంప్రదింపులు చేయకుండా చేరిక తీరు, పలు రాజకీయ అనుమానాలకు తావిస్తున్నది. టిఆర్ఎస్ క్యాడర్ ను పట్టించుకోకుండా, కాంగ్రెస్ లీడర్లు జీవన్ రెడ్డి , లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ క్యాడర్ ప్రమేయం లేకుండా డాక్టర్ సంజయ్ కుమార్ ను చేర్పించిన ఆ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉన్న పవర్ ఏమిటో ? అనే చర్చ మొదలైంది.
👉సంజయ్ కి మొదటి నుంచి పొగ ?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు 2024 ఎన్నికల్లో టికెట్టు రాదని, జగిత్యాల టికెట్ జెడ్పి చైర్ పర్సన్ అభ్యర్థి కానున్నారు అనే ప్రచారం నాటి ప్రభుత్వంలో అప్పటి మంత్రి, ఓ అధికార పార్టీ ఎం ఎల్ ఏ విస్తృత స్థాయిలో ప్రచారం చేసి సంజయ్ అనుచర వర్గంలో గందరగోళం సృష్టించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై పలుమార్లు సంజయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరు కలుపుకొని పోవాలి, చూద్దాం, ఎన్నికల చాలా దూరం ఉన్నాయి, అంటు తనను శాంతా పరిచారు తప్ప, వారిని పిలిచి మాట్లాడలేదని సంజయ్ కుమార్ తన ఆంతరంగీకుల తో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్టు చర్చ.
సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయం, ఈ అంశం ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఏమి జరగనున్నదో వేసి చూడాల్సిందే.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ హై కమాండ్ ఆపరేషన్ ఆకర్ష, పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు చేరికలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.