జగిత్యాల రాజకీయం – రేవంత్ రెడ్డికి శిరోభారం కానుందా?

J.SURENDER KUMAR,

రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు. ఈ మాటలను ఎన్నో రాజకీయ ఉదంతాలు గతంలో ఋజువు చేసాయి. మరొకసారి ఈ మాటలను జగిత్యాలలో ప్రస్తుతం కొనసాగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు నిజం చేయబోతున్నాయా ? జగిత్యాల రాజకీయం రేవంత్ రెడ్డికి శిరోభారం కానుందా ? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.

ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయల్లో, కాంగ్రెస్ పార్టీలో ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రను లోతుగా విశ్లేషించవలసి ఉంటుంది. 1980 లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ రెడ్డి. 1983 లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్, అనంతరం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాలుగున్నర దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్నగా గౌరవం పొందుతున్నారు. పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కొనసాగిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో కొనసాగిన కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజా వ్యతిరేక పథకాలపై జీవన్ రెడ్డి చట్టసభలలో, బయట బలంగా గొంతుక వినిపించి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుతూ, క్యాడర్ లో భరోసా కల్పించారు. జీవన్ రెడ్డి మంత్రిగా కొనసాగిన సమయంలో వారంలో ఐదు రోజులు పాటు జగిత్యాల అసెంబ్లీకే ఆయన పరిమితం అయ్యేవారు. తాగు సాగు నీరు, విద్యా ,వైద్యం, రహదారులు, తదితర అభివృద్ధి అంశాలు జీవన్ రెడ్డి తనదైన ముద్ర వేసుకొని గుర్తింపు పొందారు. ఓడిన, గెలిచిన జీవన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు అనేది జగమెరిగిన సత్యం.

👉జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే జిల్లాతో పాటు అనుచరులకే నష్టం !

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తో నువ్వా ? నేనా ? అనే తరహాలో జీవన్ రెడ్డి, ఆయన అనుచరుగణం పోటీపడి పోరాడిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, కవిత లు ఎంఎల్ఏ సంజయ్ నీ అడ్డుపెట్టుకొని జీవన్ రెడ్డిని, ఆయన రాజకీయ భవిష్యత్తును, అనుచర గణంను టార్గెట్ చేసి ప్రతి అంశంలో వేధింపులకు గురి వారిపై అనేక కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసింది జగమెరిగిన అక్షర సత్యం.

అయితే జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి గాని, పార్టీ కి కానీ రాజీనామా చేస్తే జగిత్యాల జిల్లాతో పాటు ఆయన అనుచరుగణం రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడంతో పాటు అపార నష్టం, అవమానాలు, ప్రత్యర్థి రాజకీయ నాయకుల కనుసైగలతో జీవన్ రెడ్డి అనుచర గణాంపై అక్రమ కేసులు నమోదు కావడం తథ్యం.

👉గాడ్ ఫాదర్ లేక…

ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తిహారి జైల్లో గత మూడు నెలలుగా జుడిషియల్ కస్టడీలో ఉండడం తో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు ఓ చర్చ. సంజయ్ తన సన్నిహితులు కాంట్రాక్ట్ పనుల చేసిన కోట్లాది రూపాయల బిల్లులు విడుదలకు పార్టీ మారినట్టు మరో చర్చ కొనసాగుతున్నది. జగిత్యాల అభివృద్ధి కోసం తన అనుచరగణం కోసం సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు అతడి అనుచర వర్గం వివరిస్తున్నారు.

👉రేవంత్ రెడ్డికి అండగా !

కాంగ్రెస్ హై కమాండ్ మూడు సంవత్సరాల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కి ఎంపిక చేసిన సందర్భంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నీ వ్యతిరేకించారు. బహిరంగంగా, ప్రచార సాధనాలలో విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి . ఒక్కరు మాత్రమే రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు.


ఐతే రాజకీయాల్లో అవసరాలకే కాని వ్యక్తులు, విలువలకు ప్రాధాన్యత ఉండదన్నది ముమ్మటికీ నిజం. మూడు సంవత్సరాల క్రితం పిసిసి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నాయకత్వం పుంజుకోవడం, రాహుల్ గాంధీ జాతీయంగా బలపడటం, తెలంగాణ సీనియర్ల జోరు తగ్గడం, జీవన్ రెడ్డి ఎంపీగా ఓడిపోవడం , జీవన్ రెడ్డి అనుభవం కంటే వీరి వయోభారం, హై కమాండ్ కు భవిష్యత్తులో భారం కాగలడనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి ఎంఎల్ఏ సంజయ్ చేరిక సమాచారం కావాలని జీవన్ రెడ్డికి ఇవ్వలేదు అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


జీవన్ రెడ్డి ఒకవేళ రాజీనామా చేస్తే పార్టీ అధికారంలో ఉన్నందున సీనియర్లు ఆయన వెంట వచ్చే అవకాశాలు తక్కువ అని రాజకీయ పరిశీలకుల అంచనా.
రాజకీయాల్లో ప్రస్తుత పరిస్తుతులే తప్ప గత వైభవానికి అంతగా ప్రాధాన్యం ఉండదు ముఖ్యంగా డబ్బు, అధికారం మాత్రమే రాజకీయాలను శాసిస్తున్న ఈ రోజుల్లో .. గతంలో పార్టీకి అందించే సేవలు, చేసిన త్యాగాలు, ప్రతిపక్ష పార్టీతో చేసిన పోరాటాలు, మహాసముద్రమైన కాంగ్రెస్ పార్టీ లో అగుపించవు, వినిపించవు అనేది అక్షర సత్యం.

జీవన్ రెడ్డి ఎంఎల్సీ రాజీనామా చేయడం వల్ల ‘రోగి అడిగింది డాక్టర్ ఇచ్చింది ఒకటే’ అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డికి తనకు కావాల్సిన వాళ్లను తెచ్చుకునే అవకాశం కల్పించడం తప్ప ఆయనకు పెద్దగా జరిగే ప్రమాదం ఏమీ లేదు అనేది కళ్లముందు కనిపిస్తున్న దృశ్యం. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు గా కొనసాగుతున్న జీవన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యానికి చెక్ పెట్టిన సంకేతాలు పరోక్షంగా సీనియర్లకు ఓ హెచ్చరిక లాంటిదే కావచ్చు అనే చర్చ కొనసాగుతున్నాది.


జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ అవరోధాలు ఏర్పడకపోవచ్చు. కానీ రాజకీయాల్లో చిన్న సంఘటన కూడా విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు. భవిష్యత్తులో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో వేచి చూడాల్సిందే.