నాన్న కష్టాన్ని గుర్తిద్దాం !

👉నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం!

👉కూతురు పడిన తపన నుంచి పుట్టిందే
ఫాదర్స్ డే…
.


****


అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. అమ్మ కంటికి

రెప్పలా చూసుకుంటే .. నాన్న కష్టాలు రాకుండా కావలి

కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని

గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై జీవన

పోరాటం చేస్తాడు. తన అలసటని కూడా కనపడనీయకుండా

బతుకుబండిని నడిపిస్తాడు.


పిల్లల్ని కనిపెంచి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ, తల్లికి లభించిన గుర్తింపు తండ్రికి లభించడం లేదని భావించి.. తండ్రి పాత్రకు తగిన గుర్తింపుకోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం). దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న అవసరాన్ని తొలిసారిగా గుర్తించి.. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్‌కు చెందిన ‘సొనారా’. ఈ విషయంలో ఆమె ఎంతగానో పోరాడి ఫాదర్స్‌ డే ఏర్పాటయ్యేలా చేసింది.


ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 50పైగా దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.

ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.


ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్లే ‘నాన్న’.. ఇంటిపట్టున ఉండలేడు.. కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు నిరంతరం తాపత్రయ పడతాడు.


నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది. వెలకట్టలేని నాన్న ప్రేమకు, త్యాగానికి ఈరోజు మనసారా అభినందనలు తెలుపుదాం. నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుదాం.

వ్యాసకర్త : యం. రాం ప్రదీప్, తిరువూరు

మొబైల్: 9492712836..