.👉నేడు మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి
తన కవిత్వం తో తాడిత, పీడిత వర్గాల బాధల్ని బాహ్య ప్రపంచానికి తెలియ జేశారు శ్రీ శ్రీ.
‘నేను సైతం..
ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను,
నేను సైతం… ప్రపంచాబ్దపు తెల్లరేకై పల్లవిస్తాను,
నేను సైతం.. విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను, నేను సైతం… భువన భవనపు బావుటానై పైకి లేస్తాను’ అని ప్రపంచ అభ్యుదయం కోసం ఎన్నో త్యాగాలు చేసి కూడా, మానవ జాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకోని శ్రమ విలువను, శ్రామికుడి గొప్పతనాన్ని గుర్తించాలని ఎలుగెత్తి నినదించిన మహాకవి శ్రీశ్రీ.
కవిత్వాన్ని జీవితానికి దగ్గరగా తీసుకు వచ్చి, నిద్రపోతున్న జాతిని ఒక్క చరుపు చరిచి లేపి అదిగో మరో ప్రపంచం అని కాంతి రేఖను చూపిన నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ. ఒక దశాబ్దం పాటు ఆంధ్ర సాహిత్యలోకాన్ని ఉత్తేజ పరిచిన అభ్యుదయ కవిత్వోద్యమ మూల విరాట్టు శ్రీశ్రీ.
భావ కవిత్వానికి విరుద్ధంగా జెండా ఎత్తడమే కాక శ్రామిక వర్గ చైతన్యం ఊపిరిగా కలిగిన కొత్త కవితా రీతికి పాదులు వేసి స్రష్ట శ్రీశ్రీ. భావకవుల చేతుల్లో వైదర్బీరీతిలో సాగిన గేయాన్ని గౌడీరీతిలో నడిపించిన భందో రహస్యవేత్త శ్రీశ్రీ.
శ్రీ శ్రీ పూర్తి పేరు.. శ్రీ రంగం శ్రీనివాసరావు. ఆయన 1910లో విశాఖపట్నంలో జన్మించారు. 1983 జూన్ 15 న మృతి చెందారు. తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకట రమణయ్య, అప్పలకొండ. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడు అవటం వల్ల ఇంటిపేరు శ్రీరంగంగా మారింది.
శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తిచేశాడు. 1925లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బిఎ పూర్తి చేశాడు. 1935లో విశాఖలోని మిసెస్ ఎవిఎన్ కాలేజీలో డిమాన్‌స్ట్రేటరుగా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరాడు. తరవాత ఆకాశవాణిలోనూ, మిలిటరీలోనూ, ఆంధ్రవాణి పత్రికలోనూ వివిధ ఉద్యోగాలు చేశాడు.
ఎనిమిదో ఏటనే కందపద్యం రచించారు. చిన్నతనంలోనే నటనానుభవం సంపాదించారు. తెలుగు కావ్యాలు చదువుకున్నారు. బాల్యంలోనే ‘సావిత్రీ సత్యవంతుడు’ అనే పద్య నాటకం రచించారు. 15వ ఏటకే ఛందస్సుపై పట్టు సాధించి ‘విశ్వ రూప సందర్శనం (1925) అనే గీతమాలికను రచించారు. దీనినే ఆయన మొట్టమొదటి రచనగా ఆరుద్ర పేర్కొన్నారు.
సాహితీ సమితిలోనూ, కవితా సమితిలోనూసభ్యుడయ్యారు. ఆ తర్వాత ‘వీర సింహ విజయసింహాలు, పరిణయ రహస్యం అనే నవలలను, 16 ఖండికలతో ‘ప్రభవ’ అనే కావ్యాన్ని రాశారు. దిగంబర కవిత్వాన్ని సమర్థించారు. విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడయ్యారు.
శ్రీశ్రీ అనగానే మహా ప్రస్థానం గుర్తుకొస్తుంది. అందులో 40 ఖండికలు ఉన్నాయి. ఈ సంకలనంలో మొదటి కవిత ‘మహా ప్రస్థానం’ అయినా ముందుగా రాసిన కవిత ‘జయభేరి’. గిబ్సన్ అనే ఆంగ్ల కవి గీతం చదివి దాని ప్రభావంతో శ్రీశ్రీ ‘జయభేరి’ రచించారు. ఆరుద్ర పేర్కొనట్లు ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను’ అనే గీతం వాడుక భాషకు దగ్గరై శ్రీశ్రీ చేత కొత్త ప్రస్థానానికి జయభేరి మోగింపజేసింది.
అభ్యుదయ సిద్ధాంతం అంటే ఏమిటి ? సామ్యవాద కవి ఎలా ఉండాలి ? శ్రామిక రాజ్యం గొప్పతనం, పీడిత వ్యవస్థ లక్షణం మొదలైన వాటిని వివరిస్తూ శ్రీశ్రీ రాసిన ‘ప్రతిజ్ఞ’ కవిత ఆయన కవిత్వానికే కాక అభ్యుదయ సాహిత్యానికే ‘మ్యానిఫెస్టో’ వంటిది.
కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు సాగించేది పరిపూర్ణపు బ్రదుకిచ్చేది అని గొప్ప కవితా నిర్వచనం చేసిన శ్రీశ్రీ పీడిత లోకంలో నిరంతరం స్మరించబడుతూనే ఉంటారు. కావాల్సిన స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. అనితర సాధ్యం ఆయన మార్గం.
తెలుగు వారిని ఉర్రూత లూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను శ్రీశ్రీ రచించాడు. శ్రీశ్రీ సుమారు 280చిత్రాలకు దాదాపు వెయ్యి పాటలు రాశారు.
బహుముఖంగా చిత్రగీతాలు రాసిన శ్రీశ్రీ ఆ రంగంలో అనేక ధోరణులకు ఆద్యులూ అగ్రగణ్యులూ అయ్యారు. మాతృకకు మక్కికి మక్కి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ‘లిప్‌సింక్’ను పాటించి, తెలుగు నుడికారంతో డబ్బింగ్ రచనలు చేసి, దానికొక ఒరవడి ప్రవేశపెట్టారు. వామపక్ష భావజాలంతో సామ్యవాద గీతాలను రాసి సినీ పరిశ్రమలో చైతన్య గీతాలకు అంకురార్పణ చేశారు. తెలుగు సినిమాల్లో యెక్కువ దేశభక్తి గీతాలను రచించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనాల్లో ముందుగా వెలువడి, ఆ తరువాత పాటలుగా సినిమాలకెక్కినవి పాతికకుపైనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా అగ్రతాంబూలం శ్రీశ్రీదే.
వ్యాసకర్త యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492712836