పోలవరం పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల !

J.SURENDER KUMAR,


ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాత్రికేయుల సమవేశం లో శ్వేతపత్రం విడుదల చేశారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా తొలిసారి క్షేత్ర స్థాయి పర్యటనగా గత సోమవారం సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
ఏడు శ్వేతపత్రాలలో భాగంగా తొలి శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్ట్ పై విడుదల చేశాను అని సిఎం తెలిపారు.

రానున్న శాసన సభ సమావేశాలలో సంబంధిత అంశాలపై చర్చ జరిపి, ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తామని సిఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల అవసరం రాష్ట్రానికి చాల ఉంది అని అన్నారు.


పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర వివరాలను అందించడానికి తొలి శ్వేతపత్రాన్ని చంద్రబాబు సచివాలయంలో విడుదల చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, పోలవరం ప్రాజెక్టును కూడా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.


2014-2019 నా హయాంలో ప్రాజెక్టును ట్రాక్‌లోకి తీసుకురావడానికి నేను వ్యక్తిగతంగా పర్యవేక్షించి, 70% ప్రాజెక్టును పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇటీవలి పోలవరం పర్యటనలో ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి, స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణాలకు సంబంధించిన అప్‌డేట్‌లను పవర్ పాయింట్ ప్రెజెంటషన్ ద్వారా విలేకరులకు వివరించారు. డయాఫ్రమ్ వాల్‌పై దెబ్బతిన్న ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు.


ప్రాజక్ట్ వివరాలను తెలియజేస్తూ దక్షిణ భారత దేశంలో నీరు లభించే ఏకైక ప్రాంతం గోదావరి. సుమారు 3000 టిఎంసి నీళ్లు సముద్రంలోకి వెళ్తాయి. కరువు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలంటే ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. 194 టిఎంసీ నీళ్లు నిల్వ చేసుకోవచ్చు, 320 టిఎంసీ ల వరకు నీరు సద్వినియోగం చేసుకోవచ్చు. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ; 28.50 లక్షల జనాభాకు త్రాగు నీరు; 960 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి; వాటర్ టూరిజం, పరిశ్రమలకు సమృద్ధిగా నీరు లభిస్తుంది.


కాటన్ దొర ద్వారా నిర్మితమైన ధవళేశ్వరం ప్రాజెక్టు తరువాత 1941 నుంచి పోలవరం అనేది ప్రజల కల ఇది. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గల నదిని డైవర్ట్ చేసే ప్రాజెక్ట్. 90 మీ. డెప్త్ ఉండే డయాఫ్రం వాల్; 20 మీ ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, 390 కి.మీ పొడవున్న కుడి, ఎడమ కాలువలు, నిర్మాణ పరంగా అతి పెద్ద ప్రాజెక్ట్. నాటి మా పరిపాలనలో ఇది ఒక గిన్నీస్ రికార్డ్, 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, ఏ ప్రాజెక్ట్ లోను నిర్వహించని కాంక్రీట్ పనులు పోలవరంలో చేపట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అని తెలిపారు. డిజైన్లకు క్లియరెన్స్ లు రావడమే గాక ఆ ఐదేళ్లలో రూ.11,762/- కోట్ల వ్యయంతో 72% పనులు పూర్తి చేసి, 31 సార్లు క్షేత్ర స్థాయి పర్యటనలతో 104 సార్లు పురోగతి సమీక్షలు చేశాం అని ముఖ్యమంత్రి తెలిపారు.


2019-2024 మధ్య పురోగతిలో చాల వత్యాసం ఉంది అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పనిచేసే ఏజెన్సీలను తొలగించి పనులు నిలిపివేశారు, సమర్ధులైన అధికారులను శాఖ నుంచి బదిలీ చేశారు. 2020 ఆగస్టులో వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదని ఐఐటీ నిపుణుల బృందం స్పష్టం చేసిందని, కేవలం నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం కూడా తెలుసుకోలేక పోయారు అని సిఎం అన్నారు. 2009లో కాంట్రాక్టర్ను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి, ఇప్పుడూ అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది అని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగానే ఉంది అనే అభిప్రాయాన్ని సిఎం వ్యక్తం చేశారు.


ప్రాజెక్టు సజావుగా పూర్తి కావాలంటే ముంపుకు గురయ్యె ఏడు మండలాలు తెలంగాణ నుంచి మన రాష్ట్రాంలో విలీనం అయితేనే సాధ్యమవుతుంది. ఈ మండలాలు మన రాష్ట్రంలో కలవడం ఒక గొప్ప పరిణామం అని సిఎం అన్నారు. 2018లో డయాఫ్రం వాల్ 436 కోట్ల రూపాయల్తో పూర్తి చేస్తే, ఇప్పుడు డామేజ్ అయిన డయాఫ్రం వాల్ మరమ్మత్తులకు 447 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజ్ వల్ల డ్యామ్ పై ఏ రకమైన పని చేయాడానికి వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి అని, సీపేజి అరికట్టడానికి అయ్యే ఖర్చు, సమయం ఎంతో అనేది కూడా అంచానాలకు చిక్కడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.


పోలవరం ప్రాజెక్టులోని తప్పిదాలను నీతి ఆయోగ్ నవంబర్ 2021 లోనే ఎత్తిచూపింది అని అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస ధోరణివల్ల ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయాయి. ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ నుంచి వచ్చిన వరద ఉదృతికి మొదటి గ్యాప్ వద్ద 250 మీటర్లు ఉన్న గేటు సైతం 150 మీటర్లు కొట్టుకు పోయింది. స్పిల్ వే ఎడమవైపు నీటి ఉదృతిని తట్టుకోవడానికి నిర్మించిన గైడ్ బండ్ కృంగి పోయిన కారణంగా దానిపై ఖర్చు చేసిన 80 కోట్ల రూపాయలు నిరుపయోగం అయ్యాయి. 2014-19 మా హయాంలో రూ.11,762.47 కోట్ల ఖర్చుతో 72% పనులు కేంద్ర నిధులు దారి మళ్లించకుండా పూర్తి చేసి కేంద్ర మంత్రుల ప్రసంశలు పొందడంతోపాటు గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాము అని, రూ.55,548 కోట్లకు అంచనా ఆమోదం కూడా పొంది, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరిగి, రూ.4,144 కోట్ల ఖర్చు తో కాలనీల నిర్మాణం, ముంపు బాధితులకు అండగా పునరావసం ఎర్పాటుతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేసిన రోజులవి. 2014 ప్రాంతంలో ఆర్ధికలోటు ఉన్న కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేంద్రం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా రూ.4,908 కోట్ల రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇచ్చినా ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టకుండా రూ.3,385.58 కోట్లు దారి మళ్లించి పోలవరాన్ని ముంచింది, నిర్వాసితులను దగా చేసింది, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా చెప్పలేము అని ప్రకటనల రూపంలో తమ అసమర్ధతను తెలిపింది, అని సిఎం అన్నారు.


ఏజెన్సీని మార్చకుండా ప్రాజెక్ట్ ప్లాన్నింగ్ సక్రమంగా అమలై ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యి హైడల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగేది, 960 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కేది. ఈ జాప్యంతో జల విద్యుత్ లభించక మూడు వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అని తెలిపారు. టిడిపి హాయంలో ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూ గత ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేదు, అంతేకాకుండా ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


పోలవరం పరిస్థితి ఆవేదన కలిగించిది, ఊహించినదానికంటే ఎక్కువ నష్టం గత ప్రభుత్వం ద్వారా జరిగింది. కాఫర్ డ్యామ్ నుంచి డయాఫ్రం వాల్ వరకు, గైడ్ బండ్ నుంచి సీపేజ్ వరకు అన్ని చోట్లా సమస్యల పరిష్కారం తరువాతే ప్రధాన పనులు చేపట్టవల్సిన పరిస్థితి నేడు నెలకొంది. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సవాల్ను అధికమిస్తాం అనే ఆశాభావాన్ని సిఎం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ లో అసాధారణ జాప్యం జరిగింది అనేది మాత్రం వాస్తవం అని పాత్రికేయులకు సిఎం తెలియజేశారు
.