పోలీస్ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వానరం!

👉సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు !

J.SURENDER KUMAR,

ఓ వానరం చిన్న పిల్లి కూనను ( పిల్లి పిల్లను ) ఎత్తుకొని గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణాలలో తిరుగుతున్నది. తప్పిపోయిన పిల్లి పిల్లను, దాని తల్లి కి పోలీసు లో, రెవెన్యూ అధికారు లో అప్పగిస్తారని కాబోలు ఆ వానరం గత మూడు రోజులుగా తహ తహ లాడుతున్నది కావచ్చు.

జాతి వైరం మరిచి మాతృత్వ మమకారం తో పిల్లి పిల్లను విడవకుండా ఇతర జంతువుల బారిన పడకుండా వానరం పిల్లిని చంకన వేసుకొని తిరుగుతున్నది. ఇది అభూత కల్పన కాదు, అక్షర సత్యం, అగుపిస్తున్న నిజం !

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఓ వానరం తెల్ల పిల్లి పిల్లతో గత మూడు రోజుల నుండి పట్టణంలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నది. ఆ వానరం తల్లి ప్రేమను పంచుతూ ఇతర జంతువులు, వానరాలు, పిల్లి పిల్లను బెదిరించకుండా, గాయపరచకుండా, జాగ్రత్త పడుతూ చెట్లపై తిరుగుతుంది.

ధర్మపురి పోలీస్ స్టేషన్ ఆవరణలో..

ఆ వానరం తన కడుపున పుట్టిన పిల్లల కంటే అతి ప్రేమగా పిల్లి పిల్లను పట్టుకొని పట్టణంలోని పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయల లాంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని చెట్ల పండ్లను తింటూ, పిల్లికి తినిపిస్తూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.