👉జగిత్యాల జిల్లా పోలీస్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి !
👉ఉపముఖ్యమంత్రి కి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వినతి పత్రం !
J.SURENDER KUMAR,
DSC-2024 కి హాజరయ్యే SC/ ST/ BC నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ను మరో నెల రోజుల పాటు పొడిగించాలని, అదే విధంగా జగిత్యాల జిల్లా పోలీస్ కానిస్టేబుల్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. పలు అంశాల పై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం DSC-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగిందనీ, దానికి సంబంధించిన DSC పరీక్ష జూలై నెలలో నిర్వహించడం జరుగుతుందనీ, అట్టి DSC-2024 పరీక్షకి హాజరయ్యే ఔత్సాహిక ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.
జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని అనేక మంది SC/ ST/ BC నిరుద్యోగ యువత కోచింగ్‌ల వ్యవధిని మరో నెల రోజులు పొడిగించేలా చూడాలని తనకు వచ్చిన వినతి పత్రాలు, మేరకు SC/ ST/ BC నిరుద్యోగ యువతలో ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, DSC-2024 కోసం తెలంగాణ స్టడీ సర్కిల్‌లలో ఉచిత కోచింగ్ వ్యవధిని మరో నెల పాటు పొడిగించాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలిసి వివరించినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
అదే విధంగా జగిత్యాల జిల్లా పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించి పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందన్నారు. DSC అభ్యర్థులకు సంబందించిన అంశం పై సంబంధిత అధికారులకు ఉపముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ల బిల్లుల అంశం పైన కూడా పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు హామీ ఇచ్చారు.