యాంటీ ప్రోటాన్ ఆవిష్కర్త !

👉నేడు నోబెల్ గ్రహీత ఓవెన్ చాంబర్‌లైన్ జయంతి!


ఓవెన్ చాంబర్‌ లైన్  10 జూలై 1920 న జన్మించారు. అయన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. అతను సబ్-అటామిక్ యాంటీపార్టికల్‌ యాంటీప్రొటాన్  ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎమిలియో సెగ్రే  తో కలిసి పంచుకున్నారు.
చాంబర్‌లైన్  1942లో మాన్‌హాట్టన్ ప్రాజెక్ట్‌లో చేరాడు. అక్కడ అతను సెగ్రేతో కలిసి పనిచేశాడు. 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాంబర్‌లైన్ చికాగో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ ఆధ్వర్యంలో తన డాక్టొరల్ అధ్యయనాలను చేపట్టాడు. ఫెర్మీ ఛాంబర్‌లైన్‌కు ముఖ్యమైన మార్గదర్శిగా మరియు సలహాదారుగా వ్యవహరించాడు. ఫెర్మీ ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం కోసం సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని విడిచిపెట్టమని అతనిని ప్రోత్సహించారు. ఛాంబర్‌లైన్ తన Ph.D. ని 1949లో  చికాగో విశ్వవిద్యాలయం నుండి పొందారు.
మన చుట్టూ ఉన్న పదార్థం ఒక రకమైన ప్రతిబింబాన్ని కలిగి ఉంటుంది. అదే విరుద్ధ ద్రవ్యం/ యాంటీ మ్యాటర్ . ఒక కణం, దాని వ్యతిరేక కణం సమానమైన మరియు వ్యతిరేక విద్యుదావేశం కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ యొక్క యాంటీ పార్టికల్ ను పాజిట్రాన్ అంటారు. మొట్టమొదట కనుగొన్న యాంటీపార్టికల్ పాజిట్రాన్. ఎక్కువ మొత్తంలో శక్తిని ఉపయోగించి ఒక జత కణాన్ని, దాని వ్యతిరేకణాన్ని సృష్టించవచ్చు‌. అలాగే ఒక కణం, దాని వ్యతిరేక కణం రెండూ కలిసినప్పుడు /  ఢీకొన్నప్పుడు ఆ రెండూ ధ్వంసమై వాటి ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది. అంటే రేడియేషన్ గా మారుతుంది.
1948 లో చాంబర్‌లైన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఫ్యాకల్టీ సభ్యునిగా బర్కిలీకి తిరిగి వచ్చాడు. అక్కడ అతను, సెగ్రే మరియు ఇతర భౌతిక శాస్త్రవేత్తలు ప్రోటాన్-ప్రోటాన్ పరిక్షేపణ ( స్కాటరింగ్ ) ను పరిశోధించారు. 1955 లో శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ బెవట్రాన్‌ సహాయంతో చాంబర్‌లైన్, సెగ్రేలు చేసిన ప్రోటాన్ పరిక్షేపణ ప్రయోగాల శ్రేణి యాంటీప్రోటాన్‌ను కనుగొనటానికి దారితీసింది. ఇది ప్రోటాన్ వంటి ఒక కణమే కానీ దాని వ్యతిరేక కణం. ఇది దాని చార్జ్ కు సమానమైన వ్యతిరేక ఛార్జ్‌‌ ( నెగెటివ్ ) కలిగి ఉంటుంది. వీరి పరిశోధన మరిన్ని యాంటీ పార్టికల్స్ ఆవిష్కరణకు దారి తీసింది.
తరువాత సంవత్సరాలలో చాంబర్‌లైన్ తన సహచరులతో హైడ్రోజన్, డ్యుటీరియం మరియు ఇతర మూలకాలతో యాంటీప్రోటాన్ల సంకర్షణను అధ్యయనం చేశారు. యాంటీన్యూట్రాన్‌లను ఉత్పత్తి చేయడానికి యాంటీప్రోటాన్‌లను ఉపయోగించారు.
చాంబర్‌లైన్  1980 లలో న్యూక్లియర్ ఫ్రీజ్ ఉద్యమం స్థాపనకు సహాయం చేశారు. 2003 లో హ్యూమనిస్ట్ మ్యానిఫెస్టోపై సంతకం చేసిన 22 మంది నోబెల్ గ్రహీతలలో ఆయన ఒకరు.ఆయన 2006 ఫిబ్రవరి 28న తుదిశ్వాస విడిచారు.


వ్యాసకర్త :యం. రాం ప్రదీప్ తిరువూరు
మొబైల్ : 9492712836