👉ఏపీ మంత్రి పి నారాయణ !
J.SURENDER KUMAR,
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సీజనల్ వ్యాధుల కట్టడి పై ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ గురువారం సమీక్షించారు.
ఆగస్టు 10 వ తేదీ నాటికి క్యాంటీన్లు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.
రాష్ట్రంలో పునరుద్ధరించే అన్న క్యాంటీన్లు, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అధికారులు తీసుకుంటున్న చర్యలపై రాష్ర్ట సచివాలయంలో వీడియో సమావేశం నిర్వహించి అధికారులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పేద , మధ్య తరగతి ప్రజలకు కోసం 2014లో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్టు మంత్రి నారాయణ అన్నారు.
2014-2019 కాలంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే, 183 క్యాంటీన్లు ద్వారా 2,25,000 మందికి కేవలం ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించామని నారాయణ తెలిపారు.
గతంలో ఇస్కాన్ అక్షయ పాత్ర ద్వారా ఆహారం సరఫరా జరిగింది, అదే విధంగా ఈసారి కూడా టెండర్లు పిలిచి జూలై 22 నాటికి ఎవరికి నిర్వహణ కేటాయించిన విషయం తెలియజేస్తామని, రాష్ట్రంలో నిర్వీర్యమైన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు ఆగస్టు 10 వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఆగస్టు 15 వ తేదీ నుంచి క్యాంటీన్లను తెరిచి నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్రంలోని 123 మంది మున్సిపల్ కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో లెనిన్ నగర్, మారుతి నగర్ లలో త్రాగు నీరు, డ్రైనేజ్ విధానాలను స్వయంగా పర్యవేక్షించి చూడగా అక్కడి ఆర్వో ప్లాంట్ లలో బాక్తీరియా గుర్తించి ఆ ప్లాంట్ లను మూసివేయడంతో అక్కడ డయేరియా పరిస్థితి అదుపులోకి వచ్చింది అని, ప్రజలు నివసించే ప్రాంతాల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని, అన్ని మున్సిపాలిటీ లలో మురుగు లేకుండా కాలువలు శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, 106 మున్సిపాలిటీలకు ₹ 50 కోట్ల రూపాయలు నిధులు ముఖ్యమంత్రి అనుమతితో విడుదల చేయడం జరిగింది అని మంత్రి తెలిపారు.
మున్సిపాలిటీలలో ఆగిపోయిన అమృత్ పథకం పనులు తిరిగి కొనసాగిస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల నిర్మాణం ద్వారా వ్యాధులు అరికట్టడం జరుగుతుందని, త్రాగు నీరు కాచి, వడపోసి ప్రజలు వాడుకోవాలని మంత్రి సూచించారు.