చెప్పలేని భావాలకు …..

👉నేడు ‘వరల్డ్ ఎమోజీ డే’


భాష అభివృద్ధి చెందకముందు మనిషి తన భావాలను వ్యక్తం చేయడానికి కొన్ని సంకేతాలు వాడేవాడు. ఇప్పటికీ బధిరులు తమ భావాలను వ్యక్తం చేయడానికి సంజ్ఞలు వాడుతారు. అంధులు బ్రెయిలీ లిపి వినియోగిస్తారు. అయితే ఆధునిక కాలంలో సోషల్ మీడియా వచ్చాకా తమ భావాలని వ్యక్తం చేయడానికి ఎమోజీలను వాడుతున్నారు.


ఒక్కోసారి మనసులో ఉన్న మాటలను చెప్పేందుకు కొన్ని కొన్ని సార్లు పదాలు చాలవు. అలాంటప్పుడు మనసులోని భావాలను ఎదుటివారికి చెప్పేందుకు ఉపయోగపడేవే ఎమోజీలు. సందర్భం ఏదైనా, ఆనందం, కోపం, బాధ ఇలా ఒక్కటేమిటి.. మనం చెప్పాలనుకునే మాటలను, మనస్సులోని భావాలను చాలా సులభంగా చెప్పేందుకు ఎమోజీలు చక్కగా పనిచేస్తాయి. ఎమోజీ అనేది జపనీస్ పదం. మాటల్లో పలికించలేని, చెప్పలేని భావాలను ఈ ఎమోజీలతో చెప్పేయవచ్చు.

ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసేప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు.
జీమెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్
వంటివి అందుబాటులోకి రాకముందు ఎక్కువ మంది యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లను ఎక్కువగా ఉపయోగించేవారు. చాటింగ్‌లో ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి.. వారి హవభావాలు తెలిసేందుకు వీలుగా యాహూ ఈ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. 2010 తర్వాత ఈ ఎమోజీలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోకి కూడా వచ్చి చేరాయి.ఏమోజీలను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం యాహూది కాదు. జపాన్‌‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్‌ వీటిని రూపొందించారు .


ఎమోజీ ఎవరు పడితే అలా విడుదల చేయరు. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఏటా వీటిని విడుదల చేస్తారు. ఇవి ఒకసారి మార్కెట్లోకి విడుదల కాగానే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తమ మొబైళ్లలో వాటిని అందుబాటులోకి తెస్తాయి. ఈ యూనికోడ్ కాన్సార్టియంలో నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, గూగుల్, టిండర్, ట్విట్టర్ తదితర సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
వాట్సాప్‌లో చేతులు లేదా మనిషి ఎమోజీలను వాడటానికి ముందు అందులో స్కిన్ టోన్ (చర్మం రంగు) చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మీరు ఏ రంగులో ఉంటారో ఆ రంగును ఎంపిక చేసుకోవచ్చు. వీటిని జెండర్ న్యూట్రల్ ఎమోజీస్ అని పిలుస్తారు.


ఇటీవల టిండర్ డేటింగ్ యాప్ ఆన్‌లైన్ పిటీషన్ ద్వారా కులాంతర జంట ఎమోజీలను విడుదల చేసింది.ఎమోజీ ట్రాకర్ అనే ఓ ఆన్‌లైన్ పోర్టల్ లెక్క ప్రకారం.. ‘టియర్స్ ఆఫ్జాయ్’ (ఆనందభాష్పాలు) ఎమోజీ మొదటి స్థానంలో ఉంది.


జులై 17న వరల్డ్ ఎమోజీ డేను నిర్వహించాలనే ఆలోచన ‘ఎమోజీపీడీయా’వ్యవస్థాపకుడు జెరేమీ బుర్జ్‌‌కు వచ్చింది. యునికోడ్ ఎమోజీ సబ్‌కమిటీలో వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన యునికోడ్ టెక్నికల్ కమిటీకి ఎమోజీ సంబంధిత సిఫార్సులు చేస్తారు.


1990లోనే ఎమోజీల వాడకం మొదలైంది. 2000 సంవత్సరం నుంచి వీటి వాడకం తారాస్థాయికి చేరుకుంది. జపాన్‌కు చెందిన ఎన్‌టీఈ డొకొమో అనే టెలికాం కంపెనీలో పనిచేస్తున్న షిగేటక కురిటా అనే వ్యక్తి.. వాతావరణ స్థితిగతులనుతెలియజేసేందుకు ఎమోజీలను వాడాడు. దీంతో అతన్ని అందరూ మిస్టర్ ఎమోజీ అని పిలవడం మొదలు పెట్టారు.ఇక 2002 జూలై 17న సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసింది. దీనికి గుర్తుగా క్యాలెండర్‌లో జూలై 17వ తేదీయే డిఫాల్ట్‌గా ఉంటుంది.


2014లో జెర్మీ బర్జ్ అనే వ్యక్తి వికీపీడియా సైట్ లాగే ఎమోటికన్‌ల కోసం ప్రత్యేకంగా ఎమోజీపీడియానురూపొందించాడు. ఇందులో యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసిన రోజు జూలై 17నే ఆయన వరల్డ్ ఎమోజీ డేగా పేర్కొన్నాడు. అందుకే ఈ రోజునే వరల్డ్ ఎమోజీ డేగా జరుపుకుంటున్నారు.ఎమోజీలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో సంభాషణలకు పెద్దగా అవకాశం ఉండదు. ఎదుటివారి మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలియదు.కాబట్టి వీటిని పరిమితంగా వాడుతూ, మానవ సంబంధాలను మంచి మాటల ద్వారానే మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి.అనవసరంగా ఎమోజీ లను ఎక్కువగా వినియోగిస్తే లేనిపోని అపార్ధాలు ఏర్పడవచ్చు.


👉వ్యాసకర్త ,యం. రాం ప్రదీప్ ,తిరువూరు
మొబైల్ : 9492712836