J.SURENDER KUMAR,
ఆరు దశాబ్దాల కాలంగా దేదీప్యమానంగా వెలుగొంది, వేలాదిమంది విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం దమనీయ దుస్థితిలో మూత పడింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చొరవతో, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి లు కళాశాలను తిరిగి ప్రారంభించడానికి నిధులు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
👉కళాశాల ఆవిర్భావం…
1966 విజయదశమి పర్వదినం రోజున స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం (శివాలయము) లో సమావేశమై, విద్యావేత్తల అభిప్రాయం మేరకు “శ్రీ లక్ష్మీనరసింహ తెలుగు కళాశాల” ను స్వర్గీయ గుండి రాజన్న శాస్త్రి ప్రారంభింప చేశారు. స్వర్గీయ కొరిడె కిష్టయ్య అధ్యక్షులుగా, స్వర్గీయ దాదాగారి కిషన్ రావు కార్యదర్శిగా కళాశాల పురుడు పోసుకుంది.
కళాశాలా నిర్వహణా వ్యయమునకు కావలిసిన నిధులను గ్రామ ప్రజలు విరాళాలు అందించారు, స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి వారు కూడ పలుచోట్ల తమ నాటకములను ప్రదర్శిస్తూ వచ్చిన ఆదాయమును కళాశాలకు అందించారు. నిరుద్యోగ యువత పగలు పనిచేస్తూ, రాత్రి చదువుకోవడానికి వారికి అనుకూలంగా కళాశాల ను నైట్ కాలేజీ గా మార్చారు. రాత్రి కళాశాలలో పనిచేయుటకు ఆనాటి ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్థానిక పండితులు ప్రతిఫలం ఆశించకుండా కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేశారు.
👉కళాశాల కు ఎయిడెడ్ సౌకర్యము ..
1967లోనే GO Ms. No. 1704. Dt. 11.08.1967 ద్వారా ప్రభుత్వం అనుమతిని పొందినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు పర్మినెంట్ అనుబంధ కళాశాలగా గుర్తించబడినది. ముందుగా 1969-70 సం. నుండి తెలుగు Osmania Entrance, Dip.O.L లకు అటు పిమ్మట 1970-71 సంస్కృత Dip.O.L మరియు 1971-72 సం. నుండి తెలుగు BOL, లకు కూడ అనుమతిని పొందినది. అంతవరకు “శ్రీ లక్ష్మీనరసింహ తెలుగు కళాశాల” గా ఉన్న కళాశాల పేరు 1970 లో “శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల” గా మార్చబడినది.
👉 ప్రభుత్వము నుండి జీతభత్యాలు !
కళాశాలా అధ్యాపకుల జీతములకు ఆర్థిక సహాయము (Aid/ ATG) కు అడ్మిట్ 1968-69 సం. నుండి సంపాదించుకొన్నది. N+1 ప్రకారము కేవలము ముగ్గురు అధ్యాపకులకు ( మరియు క్లర్క్, అటెండర్, నైట్ వాచ్మన్ పోస్ట్ లకు) మాత్రమే లభించిన గ్రాంట్ ఆ తరువాత 1976 నుండి 1 + 8 మంది లెక్చరర్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయము (ATG) లభించింది.
ఓరియంటల్ కొర్స్ లలో ఇంగ్లీష్, చరిత్రను కూడ కలిపి New Integrated Course , 3 years Degree Course గా మార్చుతూ, జనరల్ డిగ్రీ తో సమానంగా ప్రొ. సచ్చిదానందమూర్తి, కమీటి రిపోర్ట్ ను AP విశ్వవిద్యాలయముల వైస్ ఛాన్సలర్ సమావేశంలో అమలు చేయడానికి అత్త ఏం చేస్తుంది నిర్ణయించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అంగీకరించింది. 1981 సం. నుండి ఇంగ్లీష్, హిస్టరి పోస్ట్ లతో మొత్తము కళాశాలలో 1+10 అధ్యాపక పోస్టులకు , క్లర్క్, అటెండర్, వాచ్మన్ పోస్ట్ లకు ప్రభుత్వ అనుమతి లభించినది.
👉విశ్వవిద్యాలయ అనుబంధం గూర్చి..
ముందుగా ఉస్మానియాకు అనుబంధముగా 1983-84 సంవత్సరము నుండి కాకతీయ విశ్వవిద్యాలయమునకు అనుబంధముగా గుర్తింపు పొందింది. 2011-12 సం. నుండి శాతవాహన విశ్వవిద్యాలయము అనుబంధ కళాశాల కొనసాగుతున్నది.
👉సొంత భవనము క్రీడా స్థలం !
మొదట కళాశాలకు స్వంత భవనము లేక 1966 నుండి 1981 అగస్ట్ వరకు స్థానిక శివాలయ ప్రాంగణంలో కొనసాగింది.
ఆనాటి కేంద్రమంత్రి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి . P.V.నరసింహారావు సిఫారసుతో నాటి జిల్లా కలెక్టర్ K.S. శర్మ,. దాదాపుగా 90% ప్రభుత్వ సహాయంతో 1981 అగస్ట్ 2 న 8 గదులతో నూతనభవనము నిర్మితమైంది.
1988 లో నాటి కలెక్టర్ పరమహంస, గ్రామీణ పొదుపు పథకం ద్వార నిధులు మంజూరు చేసి సమావేశం మందిరం నిర్మించారు.
2003 లో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు ప్రోద్బలమున తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో మరొ గది నిర్మాణము చేపట్టారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడి గా కొనసాగిన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్రావు ఆదేశాల మేరకు అప్పటి జిల్లాకలెక్టర్ సి. పార్థసారథి SC కార్పోరేషన్ నిధులతో రెండు తరగతి గదులు, ఒ హాల్ నిర్మించారు.
ప్రస్తుతం కళాశాలకు 9 గదులు 2 హాల్ లు ఉన్నవి. వరసగా రిటైర్ మెంట్ లు,. ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ లేకపోవడంతో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ లేక కళాశాలకు ప్రిన్సిపాల్ మాత్రమే ఉన్నారు.
తెలంగాణాలో ప్రముఖ కళాశాలగా గుర్తింపు పొందిన ఈ కళాశాల కెసిఆర్ ప్రభుత్వ హాయంలో 2021 లో మూత పడింది. సొంత పక్క భవనము లైబ్రరీ, మౌలిక వసతులు ( బెంచీలు, టేబులు, కుర్చీలు ) ఎకరాకు పైగా క్రీడా స్థలము కలిగి ఉన్న ఈ కళాశాల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పునః ప్రారంభం కానున్నది.