కలాం భాటలో….


👉నేడు కలాం వర్ధంతి !

శాస్త్రవేత్తగా,రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలు అందించారు. భారత రత్న అయ్యారు.ఆయన 2015 జులై 27న తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని గౌరవం. ఉపాధ్యాయుల వల్లే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని కలాం చెప్పారు.


తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలామ్ చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. ‘ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా’ అని చెప్పారు.


1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు’ అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. ‘ఆమె భారతరత్న పురస్కారాన్ని తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను’ అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా ఓ సందర్భంలో కలామ్ చెప్పారు.


అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలామ్, తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు.


కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా అతను భావించారు. అతను భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు.

2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషించారు.
దేశ రక్షణ కోసం ఆయన చేసిన కృషిని మెచ్చుకుని అందరూ ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి.

👉వ్యాసకర్త : యం.రాం ప్రదీప్, జెవివి,తిరువూరు

మొబైల్ ;9492712836