మగ్గిడి గ్రామ హరితహారం అదృశ్యం 5 ఎకరాల భూమి అడ్రస్ ఎక్కడ ?

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్
శివారు గ్రామం “మగ్గిడి” ( పునరవాస గ్రామం )లో ఐదు ఎకరాల హరితహారం అదృశ్యమైంది. ఐదు ఎకరాల భూమిలో హరితహారం మొక్కలు ఎన్ని ఉన్నాయో ? ఆ భూమిలో పట్టే దారులు ఎందరు ఉన్నారో ? అనే అంశం రెవెన్యూ యంత్రాంగమే నిర్ధారించాల్సి ఉంది.

👉 వివరాలు ఇలా ఉన్నాయి

2016 – 17 లో ఉపాధిహామిపథకం కింద మూడు చోట్ల (మగ్గిడి గుట్టలుగా రికార్డులో ఉంది) 6 వేల గుంతలు తీసి, ఐదు ఎకరాలలో 5113 మొక్కలను నాటారు. దీనికి “మగ్గిడి హరితవనం”గా నామకరణం చేసారు. ఈ పని ఐడి నుంచి 262571202002021378 , 1379,1387 పర్యవేక్షణకు హరితహారం నిధులతో పూరి గుడిసేను ఏర్పాటు చేసారు.

👉 మగ్గిడి గ్రామంలో మిగులు భూ వివరాలు !

మగ్గిడి గ్రామంలో 252 కుటుంబాలకు గ్రామ కంఠకు 107 ఎకరాల, 17 గుంటలు కేటాయించారు. 252 కుటుంబాలకు 371 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని పంపిణీ చేసారు. ఇక్కడ 403 ఎకరాల 17 గుంటల మిగులు భూమి (ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉంది) ఇక్కడి ప్రభుత్వ భూమిలో పశువైద్యశాల కోసం భూ సేకరణను గతంలో ప్రభుత్వం చేపట్టి అర్ధాంతరంగా వదిలివేసారు.

👉 పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 16 వందల ఎకరాల మిగులు ఏమయ్యాయి ?


దాదాపు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందలాది ఎకరాల పడావు భూములకు పట్టాలు పుట్టాయి. దాదాపు 16 వందల ఎకరాల మిగులు భూమి కి ( పడావు భూమి ) . రెవెన్యూ రికార్డులలో పట్టాలు పుట్టాయి. ధరణిని అడ్డుపెట్టుకొని కొందరు నాయకులు అడ్డగోలుగా భూములను అందినంత ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

👉 మిగులు భూములు ఎక్కడివి అంటే…

పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారిని పునరావాసులుగా గుర్తించి వారికి వ్యవసాయ భూములకు పట్టాలు ఇచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామాలలో నాడు వందల ఎకరాలు మిగులు తుంది భవిష్యత్తు అవసరాల కోసం గుర్తించి ప్రభుత్వం నిల్వ ఉంచింది. పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంలో 1) డొంకేశ్వరం, 2 ) నేదునూరు, 3 ) అన్నారం,4 ) గంగ సముద్రం, 5 )నూత్ పల్లి, 6) వచ్చునుర్, 7 ) నికాల్ పూర్, 8 ) కోమన్ పల్లి, 9 ) గాదె పెళ్లి,10 ) మగ్గిడి 11 ) కోసునూరిపల్లె, 12 ) సిరిపురం, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇందులో నిజామబాద్ జిల్లాకు చెందినది 10 గ్రామాలు కాగా కరీంనగర్ జిల్లాకు చెందిన (వచ్చునుర్, నేదునూర్) ఉన్నాయి.

👉 4,955 ఎకరాల భూసేకరణ !

12 ముంపు గ్రామాల పునరావాసం కోసం ప్రభుత్వం 1973, అక్టోబర్ 17 న, జీవో నంబర్.1139 ద్వారా జగిత్యాల జిల్లా లోని దొంతపూర్ అడవి నుండి, 4,955 ఎకరాలు 27 గుంటల భూమి నీ ప్రభుత్వం సేకరించి పునరావాస ( పోచంపాడు ప్రాజెక్టు ముంపు బాధితులకు ) గ్రామాలకు. పంపిణీ చేశారు. ప్రస్తుతం ధర్మపురి బీర్పూర్ మండలాల పరిధిలో ఈ గ్రామాల భూములు ఉన్నాయి.

👉 మిగులు ( పడావు) భూమి 1676 ఎకరాలు.!

పునరావాస 12 గ్రామాలలో 2008 ( రెండువేల ఎనిమిది ) మంది వ్యవసాయ కుటుంబాలను ప్రభుత్వం గుర్తించంది. ప్రభుత్వం సేకరించిన 4,955 ఎకరాల 25గుంటల భూమిలో 1676 ఎకరాల 25 గుంటల భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేదని, భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం ఇతరులకు కేటాయించకుండా మిగులు భూమిగా రికార్డులలో నమోదు చేసి ఉంచారు. అయితే ఈ భూమిలో 576 ఎకరాల 7 గుంటల భూమి కొంతమేరకు మాత్రమే సేద్యం కు అనుకూలంగా ఉందని రెవెన్యూ రికార్డులను స్పష్టంగా పేర్కొన్నారు.

👉 పునరావాస గ్రామాలకు కేటాయించిన భూమి వివరాలు !

12 పునరావాస గ్రామాల ఏర్పాటుకు స్వాధీన పరుచుకున్న భూమిలో 346 ఎకరాల 12 గుంటలు ( గ్రామ కంట శివారు ) వ్యవసాయం కోసం. 2,849, ఎకరాల 27 గుంటలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం సేకరించిన భూమిలో మొత్తం 3,194 ఎకరాలు 39 గుంటలు భూమి పునరావాసులకు పంపిణీ చేయగా వ్యవసాయానికి అను కూలంగా లెని 1,676 ఎకరాల 25 గుంటల మిగులు భూమి గా ఉండాలి.

👉 విజిలెన్స్ విచారణ జరిపితే..

ధర్మపురి, సారంగాపూర్, ( ప్రస్తుతం బీర్పూర్ ) మండల రెవెన్యూ శాఖలో ఒకరిద్దరు కీలక అధికారులు విధులు నిర్వహించిన సమయంలో భూముల మాయంపై రెవెన్యూ రికార్డులు పరిశీలించి విచారణ జరిపితే ధరణిలో మార్పులు, చేర్పుల భూ వివరాలు, అధికారులు అతి ఉత్సాహం వెలుగు చూసి అవకాశం ఉంది.