👉బాధితురాలికి వడ్డీతో సహా ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని ఆదేశం !
J.SURENDER KUMAR,
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన బాధితుడి కుటుంబానికి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు భీమా డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో వినియోగదారుల న్యాయస్థానం ( ఫోరమ్ ) బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆదుకుంది.
👉వివరాలు ఇలా ఉన్నాయి…
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన వేముల కుర్తి రాజం, @ పోతరాజు రాజం మల్లాపూర్ సింగిల్ విండో ( ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ ) లో సభ్యత్వం పొంది ఉన్నారు. రాజం ‘కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం’ కింద రుణం పొందాడు. ఇందులో గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ బెనిఫిట్ ను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీవారు ప్రకటించారు.
మల్లాపూర్ సింగిల్ విండో సొసైటీ వారు, కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో రుణం పొందిన రైతులకు సంబంధించిన ఇన్సురెన్స్ ప్రీమియం డబ్బులు కరీంనగర్ కే డి సి ద్వారా చెల్లించారు.
2014, జూన్ 10న రైతు రాజం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీస్ వర్గాలు విచారణ జరిపి రాజం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు నిర్ధారిస్తూ ఎఫ్ ఐ ఆర్ జారీ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోతరాజు రాజం భార్య, శ్రీమతి రాజు, నిర్ణీత వ్యవధిలోనే పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలతో, సింగిల్ విండో కార్యాలయం ద్వారా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి సమర్పించారు.

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు, మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తూ, ఆధార్ కార్డు ఆధారంగా, మృతి చెందిన రాజం వయస్సు 70 సంవత్సరాల,11 నెలల 17 రోజులు ఉన్నందున ఇన్సూరెన్స్ డబ్బులు పొందే అర్హత లేదని డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు.
మృతుడి భార్య రాజు, 2018, ఫిబ్రవరి, 23 న ప్రముఖ న్యాయవాది, మెట్ట మహేందర్ ద్వారా న్యాయం కోసం కరీంనగర్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన ఫోరం సభ్యులు శ్రీమతి శ్రీలత, సిహెచ్. వి. నరసింహారావులు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ తీరును తప్పు పట్టారు.
బాధితురాలికి ఇన్సూరెన్స్ డబ్బులను, 2018 ఫిబ్రవరి మాసం నుంచి 9% వడ్డీతో కలిపి తక్షణం చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం బాధితురాలికి మరో 5 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తూ గత నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు.