పెండింగ్ ధరణి దరఖాస్తుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి !

👉ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి

👉జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

J.SURENDER KUMAR,

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు
మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


వన మహోత్సవం, ప్రజాపాలన సహాయ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, వానకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఉద్యోగుల సాధారణ బదిలీలు వంటి పలు అంశాలను సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. పెండింగ్ ధరణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లా స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.


వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అవసరమైన మేర మొక్కలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.


జిల్లాలలో పల్లె ప్రకృతి వనాలు, అర్భన్ పార్క్ లలో మొక్కల పెంపకం పై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను రిప్లేస్ చేయాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


మహిళా శక్తి కార్యక్రమంలో ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదుక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు , మహిళా సంఘాల చే విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టడం నిర్వహించామని, ప్రస్తుతం క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు‌
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 936 నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని, వీటిలో వీలైనంత మేర మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయాలని, ఆసక్తి , అర్హత గల మహిళల గుర్తింపు, వారి శిక్షణ, ₹ 2.5 లక్షల బ్యాంకు లింకేజ్ రుణం వంటి అంశాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సిఎస్ అన్నారు.


జిల్లాలో ప్రముఖమైన ప్రదేశాలలో మహిళా సంఘాలచే అమ్మ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని, క్యాంటిన్ లలో నాణ్యమైన పదార్దాలు వినియోగించాలని సూచించారు. మహిళా శక్తి కింద ఇతర వినూత్న కార్యక్రమాలను అమలు చేసేందుకు సలహాలు సూచనలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు.


గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా ల ద్వారా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వీలైనంత మేర మహిళలను మహిళ సంఘాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర నూతన మహిళా సంఘాల ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళా సంఘాల జిల్లా సమాఖ్య సమావేశం, మండల సమాఖ్య సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించాలని ఆదేశించారు.


స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ఆ రుణాలతో మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.


అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల చివరి దశ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి రెండవ జత ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.
వానకాలం ప్రారంభమై మంచి వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పెరుగుతుందని, రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. విత్తనాల లభ్యత అంశాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అన్నారు. రైతు భరోసా వర్క్ షాప్ లో పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు.


సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మల్లేరియా కేసుల వ్యాప్తి అరికట్టాలని, స్థానిక సంస్థల అధికారులు పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలు, పట్టణాలలో రెగ్యులర్ గా ఫాగ్గింగ్ నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రఘువరన్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.