👉దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్!
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకం ద్వారా ఆ సంస్థకు ఎంతో గౌరవం పెరిగిందని దేవరకొండ శాసన సభ్యులు బాలునాయక్ అన్నారు.
నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీలతో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉత్తమ పాత్రికేయులుగా, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీనివాస్ రెడ్డి అనుభవాలు ఓ చరిత్ర అని బాలునాయక్ కొనియాడారు. ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులతో తత్సంబంధాలు కలిగివున్నప్పటికీ శ్రీనివాస్ రెడ్డి ఏనాడూ ఆ గర్వాన్ని ప్రదర్శించలేదని, సౌమ్యులుగా సాదాసీదా జీవితాన్ని గడపడం స్ఫూర్తి దాయకమన్నారు.
ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, వీలైనంత తొందరలో ఇండ్లు, ఇంటి స్థలాలను అందించేందుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బాలునాయక్ భరోసా ఇచ్చారు. అలాగే మల్లేపల్లిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం, నిధులను మంజూరీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారానికి సియం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సానుకూలంగా ఉన్నారని, వారి సూచన మేరకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం, అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన మీడియా వృత్తిని అప్రతిష్ట పాలుచేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, దాదాపు యాభై యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల గొంతుకగా పోరాడుతున్న శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకం కావడం ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు. అనునిత్యం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఆయన సారథ్యంలో జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడిందని విరాహత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లేపల్లి ఎంపిపి అధ్యక్షురాలు రేఖ శ్రీధర్ రెడ్డి, యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
