ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలి!

👉ఏపీ మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు!


J.SURENDER KUMAR,

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించేది ప్రభుత్వ అధికారులేనని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే అధికారుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు.


జూలై 22వ తేదీ నుంచి శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అన్ని శాఖల కార్యదర్శులతో శాసన సభ కార్యాలయ సమావేశ మందిరంలో శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, ఆర్ధిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించి, సభల నిర్వహణలో నిర్వహించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా స్పీకర్ మంత్రి మాట్లాడుతూ..


సంబంధిత అధికారులు సంపూర్ణమైన సమాచారం నిర్ధిష్ట సమయంలోపు మంత్రులకు అందజేయాలి – శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల అన్నారు.


ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ, సభా సాంప్రదాయాలు పాటిస్తూ, సభా గౌరవం నిలబెట్టేలా సమావేశాలు నిర్వహించాలి – ఆర్ధిక, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.


సభలో ప్రజా ప్రతినిధులు చర్చించి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరిగినట్టే అని భావించి, తదను గుణంగా హామీలు కార్యరూపం దాల్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం పారదర్శకమైన పాలన ప్రజలకు అందించినట్లవుతుందని మండలి చైర్మన్ అధికారులకు సూచించారు, సభలో ప్రతి ఒక్క సభ్యుడికి గౌరవం దక్కాలని ఆయన అన్నారు.


శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చింతకాయల మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన అధికారు లందరినీ ఈ సమావేశ సందర్భంగా కలవడం నాకు సంతోషంగా ఉంది అని , శాసన సభ సమావేశాలు ఏవో జరిగాయి అంటే జరిగినట్టు కాకుండా, సభలోని ప్రతి మాట, చర్చ సభ్యులకే పరిమితం కాదని, ప్రజలను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు సహకరించాలని సభ్యులను కోరుతున్నానని అన్నారు.


చర్చలు సజావుగా జరగాలంటే సంబంధిత శాఖల అధికారుల పాత్ర అత్యంత కీలకమని గ్రహించాలి, నిర్ధిష్ట గడువులోపు సభలో చర్చకు వచ్చే అంశాలకు చెందిన సమాచారం అధికారులు మంత్రులకు అందజేయాలని, అవసరమైతే ఒకరోజు ముందుగానే అధికారులు మంత్రులతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించారు.

సభలో మంత్రులు ఇచ్చే సమాధానాలు సభ్యులతో పాటు అవి ప్రజలకు కూడా చేరుతాయని గ్రహించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సమన్వయ కర్తగా ఒక నోడల్ అధికారిని కూడా నియమించి, అధికారులకు, మంత్రులకు సహకరించేందుకు కృషి చేయాలని స్పీకర్ కోరారు.


ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత తొలిసారి సభలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలకు జవాబుదారీ తనంతో, అర్ధవంతమైన చర్చలతో, ప్రజలకు మేలు జరిగేలా ఉభయ సభల నిర్వహణకు కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాము అని ఆర్ధిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉభయ సభలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని, సభలు ముగిసే వరకు అధికారులు సంబంధిత శాఖల మంత్రులకు అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశంలో తెలియజేశారు.


శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, జాయింట్ సెక్రటరీ ఎం. విజయారాజు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.