👉శాంతి భద్రతలు వద్దు సివిల్ పంచాయతీలు ముద్దు !
👉ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ?
J.SURENDER KUMAR,
జగిత్యాల్ జిల్లా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారి పరిధి దాటి బాధితులు ఆ శాఖ ఉన్నతాధికారులకు కలిసి వినతిపత్రం ఇస్తే ‘ మీరు ఎక్కడికి పోయినా అది ( ఫిర్యాదు పత్రం ) ఇక్కడికే వస్తుందంటూ ఫిర్యాదుదారులతో హేళనగా, వ్యంగంగా మాటల తీరుతో ఆ స్టేషన్ పరిధిలోని గ్రామీణలు గజగజ లాడుతున్నారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణ పక్కన పెట్టి ప్రైవేట్ పంచాయతిలలో జోక్యం చేసుకొని తాను చెప్పినట్టే వినాలంటూ పంచాయతీలోని ఓవర్గానికి హుకుం జారీ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు స్వయంగా ఆ అధికారి పంట చేలలోకి వెళ్లి , పెద్దల సమక్షంలో పంచాయతీ చేసుకుంటారా ? మీ పై కేసులు పెట్టి బొక్కలో తోయమంటారా ? అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆ స్టేషన్ పరిధిలో కొన్ని చివరి గ్రామాలలో వ్యవసాయ భూములు సరిహద్దు వివాదాలు, భార్యాభర్తల గొడవలు, చిన్న చితకా తగాదాల సమాచారం ఆ స్టేషన్కు తెలిస్తే ఆ అధికారికి పండగే. ఈ స్టేషన్ పరిధిలోనీ ఓ గ్రామంలో గత నెలరోజుల క్రితం మద్యం మత్తులో కొందరు యువకులు బీరు సీసాలతో గొడవ పడగ వారికి రక్త గాయాలు అయినట్టు చర్చ. ఈ అధికారి మాత్రం ఇరు వర్గాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తూ మౌనం వహించడంలో మర్మం ఏమిటనే చర్చ ఈ ప్రాంత యువతలో జరుగుతున్నది.

ఇది ఇలా ఉండగా స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాలలో వ్యవసాయ భూముల, వివాదాలు ఉండి ఉంటే ఏ క్షణంలో పోలీస్ స్టేషన్ నుంచి హుకుం జారీ చేస్తూ పంచాయతీ చేసుకోండి అంటూ ఆదేశాలు జారీ చేస్తారో అనే భయంతో ఆ ప్రాంతం గ్రామీణలు భయాందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్, స్టేషన్ అధికారికి అనుంగా అనుచరుడిగా కొనసాగుతూ, సమయపాలన పాటించకుండా, కాల్ రుల్ నిబంధనలకు విరుద్ధంగా. ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ పంచాయతీల సెటిల్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు అని అక్కడ విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుల్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
నిజాయితీ పోలీసు అధికారిగా, పోలీసుల పక్షపాతిగా, ముక్కు సూటిగా, చర్యలు చేపట్టే అధికారిగా గుర్తింపు ఉన్న జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, విచారణ జరిపి, ప్రజలకు న్యాయం చేసి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తారని బాధితులు ముక్తకంఠంతో ఎస్పీని కోరుతున్నారు.