👉ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్ చైర్మన్ !
J.SURENDER KUMAR,
ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ కు వివరించారు.

ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని యాంగ్ లియూకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో సీఎం రేవంత్ రెడ్డి విజన్ అద్భుతంగా ఉందని యాంగ్ లియూ కొనియాడారు.
సాధ్యమైనంత తొందర్లోనే హైదరాబాద్ ను సందర్శిస్తానని ఫాక్స్‌కాన్ చైర్మన్ ముఖ్యమంత్రి తో చెప్పారు. అంతకంటే ముందుగా ఫాక్స్‌కాన్ క్యాంపస్ ఆపరేషన్స్ చీఫ్ క్యాథీ యాంగ్ ఫాక్స్‌కాన్ భారత దేశ ప్రతినిధి వీ లీ (V Lee) నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని యాంగ్ లియూ తెలిపారు.

సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి బృందం విజయవంతంగా చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన, రాబట్టిన పెట్టుబడులు, తెలంగాణపై అంతర్జాతీయంగా నెలకొన్న ఆసక్తుల వివరాలను కూడా మంత్రి శ్రీధర్ బాబు యాంగ్ లియూ కు తెలియజేశారు.