గోవులను రక్షించడం ద్వారా హిందూ ధర్మానికి జవసత్వాలు!

👉టిటిడి ఆలయాల ఈవో శ్యామల రావు!


J.SURENDER KUMAR,

వేదాలు, పురాణాల్లో పూజ్యమైన గోమాతను రక్షించడం ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయాలని టీటీడీ ఈవో  జె శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ గో సంరక్షణశాలలో మంగళవారం జరిగిన గోకులాష్టమి గోపూజ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మంలో గోవుకు కీలక స్థానం ఉందని, గోమాతను ఆరాధించడం ద్వారా దేశంలో వ్యవసాయ శ్రేయస్సును పెంపొందించారని అన్నారు. గోశాలలో భక్తులకు బెల్లం, అన్నం, పశుగ్రాసం అందించి గోమాతకు తినిపించేందుకు టీటీడీ సౌకర్యాలు కల్పించిందని తెలిపారు.

తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం సుభిక్షంగా ఉండాలంటే గోమాత ఆరాధన ఎంతో కీలకమని, గోపూజ ప్రచారానికి టిటిడి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

ముందుగా ఈఓ గోమాత, శ్రీ వేణుగోపాల స్వామికి పూజలు నిర్వహించారు. ముందుగా ప్రత్యేక అభిషేకం, వేణుగానం, వేదపఠనం, భజనలు, కోలాట, అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించారు.అనంతరం ఎస్‌పిడబ్ల్యుడిపిజి విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు, హెచ్‌డిపిపి కళాకారుల హరికథ భక్తులను అలరించాయి. జేఈవో శ్రీమతి గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌, గోశాల డైరెక్టర్‌ డాక్టర్‌ హరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.