👉జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నళినిప్రభాత్ !
👉కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్!
J.SURENDER KUMAR,
సీమాంతర ఉగ్రవాదుల దుశ్చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి కరీంనగర్ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నళినిప్రభాత్ పాలన అనుభవం అవసరం కలిగింది.
జమ్మూ కాశ్మీర్ లో సవాళ్లతో జరగనున్న ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకే ఆ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి నళినిప్రభాత్ ను నియమిస్తూ హోమ్ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి గా సాగుతున్నారు. ఈ సందర్భం కాకతాళీయంగా చోటు చేసుకున్న ఈ అంశంను పలువురు చర్చించుకుంటున్నారు.
అయితే అక్టోబర్ 1 నుంచి డీజీపీగా నళిని ప్రభాత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం డీజీపీ గా కొనసాగుతున్న ఆర్ ఆర్ స్వైన్ సెప్టెంబర్ 30న పదవి విరమణ చేయనున్నారు.
వామపక్ష తీవ్రవాదులతో పాటు సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాల కట్టడి, పోరాటంలో సుదీర్ఘ అనుభవం కల్గిన నళిన్ ప్రభాత్ నియామకంతో జమ్ము-కాశ్మీర్ పోలీస్ విభాగం మరింత శక్తివంతంగా మారనుంది.
1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన నళిని ప్రభాత్ తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు. కరీంనగర్, వరంగల్, తోపాటు కడప జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.
👉ముగ్గురు పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్ !
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పీపుల్స్ కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ తీరుపై ప్రజా సంఘాలు, పోలీస్ సంఘాలు పరస్పరంగా పలు ఆరోపణలు చేసుకున్నారు. అప్పుడు జిల్లా ఎస్పీ నల్లి ప్రభాత్ కొనసాగుతున్నారు.
పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి @ ముప్పాల లక్ష్మణరావు కొనసాగుతుండగా ఆయన స్వగ్రామం ఇదే జిల్లా బీర్పూర్ కావడంతో ఈ జిల్లాపై పోలీసు యంత్రాంగం డేగ పహారా నిర్వహించేది. నాడు నక్సలైట్ల ప్రాబల్యం గల గ్రామాలలో వార్ సానుభూతిపరులు, మిలిటెంట్లు, ఆశ్రయం కల్పించేవారు, రవాణా దారుల వివరాలను పకడ్బందీగా సేకరించి సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో పోలీసు ప్రత్యేక బృందం అర్ధరాత్రి వారిని వారు ఉన్న ప్రాంతం నుంచి తరలించి వివరాలు సేకరించి అదే రాత్రి వారి గ్రామాల్లో ఇంట్లో వదిలేసేవారు.
👉ట్రాక్టర్ నడిపిన ఎస్పీ నళిని ప్రభాత్ !
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ లో దినపత్రిక జర్నలిస్టు, పోలీస్ ల అదుపులో ఉండి స్టేషన్ లో మృతి చెందాడు. జర్నలిస్టు మృతి చెందిన తీరు పై వందలాదిమంది జర్నలిస్టులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ని ముట్టడించి న్యాయం జరిగేవరకు జర్నలిస్టు మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దు అంటూ, జర్నలిస్టు సంఘ నాయకులు, జర్నలిస్టులు దిగ్బంధం చేశారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగివచ్చి జర్నలిస్ట్ కుటుంబానికి ₹ 2. లక్షల పరిహారం, సంఘటనపై రిటైర్డ్ జడ్జ్ తో న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే మరికొన్ని డిమాండ్ల కు ప్రభుత్వం స్పందించలేదు. దీంతో జర్నలిస్టుల ఆందోళన 48 గంటలకు చేరింది. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం సీరియస్ కావడంతో. అప్పటి జిల్లా కలెక్టర్ దేవబ్రత కంఠ, జగిత్యాల ఏ.ఎస్పీ అతులు సింగ్, ఆసుపత్రి మార్చురీలో ఉన్న జర్నలిస్టు మృతదేహాన్ని 2 km దూరంలో ఉన్న పోస్టుమార్టమ్ ప్రాంతానికి తరలించడానికి రాత్రి దాదాపు 12 గంటల సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ కోసం వేచి చూస్తున్నా రు. ఈ దశలో ఎస్పి నళిని ప్రభాత్ ఆలస్యం వద్దు, అంటూ తానే ట్రాక్టర్ ను నడిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని భారీ పోలీస్ బందోబస్తు మధ్య జర్నలిస్టు స్వగ్రామానికి తరలించి తెల్లవారేసరికల్లా దహన సంస్కారాలు నిర్వహించారు. జర్నలిస్టులను, ప్రజా ప్రతినిధులను, పోలీసులు ముందస్తుగా గ్రామ పొలిమేరలోనే అడ్డుకున్నారు.
👉నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డిజీ గా…
ప్రముఖుల రక్షణ బాధ్యతలతో పాటు దేశంలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో అత్యుత్తమ కమెండో ఫోర్స్‌గా ప్రఖ్యాతి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) ఆ బలగానికి అధిపతి (డైరెక్టర్ జనరల్)గా నళిన్ ప్రభాత్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2028 ఆగస్టు 31న పదవీ విరమణ చేసే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారంటూ పేర్కొంది.
కొద్ది నెలల్లోనే నళిన్ ప్రభాత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి సెంట్రల్ సర్వీసెస్ నుంచి AGMUT (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెర్రిటరీస్) కేడర్‌కు బదిలీ చేసింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆలిండియా సర్వీసెస్ అధికారులు పనిచేస్తుంటారు. గత కొన్నేళ్లుగా సెంట్రల్ సర్వీసెస్‌లో భాగంగా కేంద్ర పారా మిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఎన్ఎస్జీ చీఫ్‌గా నియమితులయ్యే వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు.
👉అవార్డులో రివార్డులు..
నళిని ప్రభాత్, విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు దక్కాయి. గ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్ (విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP) 14వ బెటాలియన్ (శ్రీనగర్), 21వ బెటాలియన్ (శ్రీనగర్), 16వ బెటాలియన్ (లడఖ్) లకు కమాండెంట్‌గా పనిచేశారు. సీఆర్పీఎఫ్‌లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన నళిని ప్రభాత్, కొంతకాలం చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్‌లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.
సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు జమ్ము కాశ్మీర్ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరి కోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించింది. అప్పటి వరకు ఆయన స్పెషల్ డైరెక్టర్ జనరల్ (Spl DG) గా వెంటనే బాధ్యతలు చేపట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ప్రస్తుతం జమ్ము-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున ఆ రాష్ట్రం పోలీస్ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య వివిధ విభాగాల అధిపతులు పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే మరొకరిని స్పెషల్ డీజీ, ఓఎస్డీ వంటి హోదాలతో నియమిస్తోంది. తద్వారా ఆ విభాగంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోడానికి తగిన సమయం కొత్త అధికారికి దొరుకుతోంది. విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టడంతోనే రంగంలోకి దిగి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం కల్గుతోంది.