మస్కట్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లావాసి!

👉విదేశాంగ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బాధితుడి భార్య!

👉స్పందించిన జిల్లా కలెక్టర్, మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ !


J.SURENDER KUMAR,


కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన యెల్ది ప్రభాకర్ గత మూడున్నర నెలలుగా ఓమాన్ రాజధాని మస్కట్ లో పని, జీతం, సరైన భోజనం, వసతి కూడా లేకుండా ఇబ్బందిపడుతున్న దీని స్థితి వెలుగులోకి వచ్చింది. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహకారంతో బాధితుడు ప్రభాకర్ భార్య అనసూయ హైదరాబాద్ లోని విదేశాంగ శాఖ అధికారి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) కి మంగళవారం ఈమేరకు ఫిర్యాదు చేశారు. 


మస్కట్ బల్దియా లో రోడ్ క్లీనర్ ఉద్యోగం అని వాగ్దానం చేసిన ఏజెంటు తమ నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. మే 8న మస్కట్ కు చేరుకున్న ప్రభాకర్ ఎలాంటి పనిలేకుండా ఒక రూంలో విద్యుత్, నీటి సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కామారెడ్డి లో తమకు తెలిసిన వ్యక్తి ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు చెందిన సామ్ ట్రావెల్ సర్వీసెస్ అనే లైసెన్స్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా, ఎమిగ్రేషన్ సేవలు అందించారని అన్నారు.

ముంబయి నుంచి మస్కట్ చేరిన నాటి నుంచి ప్రభాకర్ ఇబ్బందులకు గురవుతున్నాడని, రిక్రూటింగ్ ఏజెన్సీపై, విదేశీ యజమానిపై తగిన చర్య తీసుకొని ప్రభాకర్ కు  ఉద్యోగంకల్పించి తగిన న్యాయం చేయాలని అనసూయ విజ్ఞప్తి చేశారు. 


ఇదిలా ఉండగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్యర్యం లోని ‘మదద్’ హెల్ప్ లైన వారు స్పందించి ఓమాన్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఓమాన్ లోని ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఒకరు బుధవారం ప్రభాకర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎంబసీ నుంచి కాల్స్ చేస్తే కంపెనీ యాజమాన్యం, సబ్ కాంట్రాక్టర్ స్పందించడం లేదని తెల్సింది. కేసును లేబర్ కోర్టుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామారెడ్డి తహసీల్దార్ తమ సిబ్బందిని మద్దికుంట గ్రామానికి పంపి గల్ఫ్ బాధితుడు ప్రభాకర్ భార్య అనసూయ నుంచి వివరాలు సేకరించారు.