👉భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ
J.SURENDER KUMAR,
గత కొంత కాలంగా తెలంగాణ, ఏపీ, చత్తీస్ ఘడ్ పోలీసు ఇంటలిజెన్సీ ఉన్నతాధికారుల నేతృత్వంలో పార్టీలో కొందరిని కోవర్టులుగా ఆర్గనైజ్ చేసి పార్టీకి భారీ నష్టాన్ని కలుగజేయాలని పథకరచన చేసారు. పార్టీ పరిశీలన, అప్రమత్తత ద్వారా ఈ కుట్రను పసిగట్టి పోలీసుల కోవర్టు నీల్సో (రాధ)ను చంపివేసాం అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.
👉మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో
వివరాలు ఇలా ఉన్నాయి..
విప్లవిద్రోహిగా మారిన నీల్సో(బంటి రాధ)ను కూడా విచారించగా మొత్తం శతృవు కుట్రను, ఇందులో తన పాత్రను అంగీకరించింది. రాధ హైదరాబాద్లోని బాలాజీనగర్, అంబేడ్కర్నగర్ (న్యూ ఇందిరానగర్)కు చెందిన బంటి బాలయ్య, బాలమ్మల కుమారై. ఆమె ఇంటర్ వరకు చదువుకొని, డీ. ఎమ్.ఎల్.టి పూర్తిచేసి 2018లో విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. గడిచిన 6 సంవత్సరాల కాలం ఏ.ఓ. బీలోనే తన విప్లవ కార్యాచరణను కొనసాగించింది. పార్టీ సభ్యురాలిగా, జోన్ మిలటరీ ఇన్స్ట్రక్టర్గా, నాయకత్వ రక్షణాదళం కమాండర్గా బాధ్యతలు నిర్వర్తించింది.

ఈ ఎదుగుదలతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. గత 3 నెలల క్రితం పార్టీ తనను కమాండర్ బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది.
నీల్పో ఉద్యమంలో చేరిన తర్వాత మొదట ఆమెను పార్టీ నుండి బయటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేసారు. ఈ క్రమంలో రాధ తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం అశలు చూపగా పోలీసులకు లొంగిపోయి వారికి పూర్తిగా సహకరించడానికి సిద్దపడి ఏజెంటుగా మారాడు.
అప్పటి నుండి రహస్యంగా పోలీసు ఇంటలిజెన్సీ విభాగంలో పనిచేస్తూ వారి ప్రోద్భలంతో తనతోపాటు నిరుద్యోగ, లంపెన్ యువతను కొందరిని ఆర్గనైజ్ చేయడం ప్రారంభించాడు. అందులో ప్రీతి, రాజు, సురేష్, రాజులతో కలిపి ఒక టీం ఏర్పడింది. ఇలా ఏర్పర్చిన మరికొన్ని టీమ్లలతో పార్టీ సానుభూతిపరుల, విప్లవాభిమానుల, ప్రజాసంఘాల కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ దాడులు చేస్తున్నారు.
అందుకు పోలీసులు వీరికి పెద్దమొత్తంలో డబ్బుల్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం రాధ ఫోన్ నెంబర్ను దొరికించిన పోలీసులు మొదట గతంలో తన సన్నిహిత స్నేహితురాలైన మమత ద్వారా ఫోన్ చేయించి, ఆమెను బలహీనపర్చి ఉద్యమం నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తర్వాత కుటుంబ సభ్యులను చంపుతామనీ, జైళ్ళో పెడతామని బెదిరించి లొంగదీసుకున్నారు. తర్వాత రాధ తమ్ముడు సూర్యం ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, తల్లి అనారోగ్యం, తన నిరుద్యోగ సమస్యలు ముందు పెట్టి ఉద్యమం నుండి బయటకు రావడంగాని లేక పార్టీలోనే ఉంటూ తాను కోరిన పార్టీ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా పై సమస్యలు పరిష్కారమవుతాయని
ఆమెతో మాట్లాడాడు.
అందుకు ఆమె సిద్ధపడి అప్పటి నుండి తెలంగాణ, చత్తీస్ఘడ్ పోలీసు ఇంటలిజెన్సీ అధికారుల సంబంధంలో ఉంటూ వారు కోరిన విధంగా నాయకత్వపు, పార్టీ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది. నాయకత్వ నిర్మూలన కోసం పోలీసులు రూపొందించుకున్న భారీ పథకాన్ని అమలు చేయడానికి పార్టీలో కొంతకాలం నుండి పని చేస్తున్న కొందరు కోవర్టులతో ఈమెను కలిపి ఒక టీంగా పని చేసే విధంగా గైడ్ చేసారు అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.