👉కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి!
J.SURENDER KUMAR,
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతుంది కానీ పక్క రాష్ట్రాలతో కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కోకాపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపస్ ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కాగ్నిజెంట్ సంస్థకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా మారిందని, ప్రస్తుతం సుమారు 65వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఎదగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా తెలంగాణ ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని చెప్పారు.
రాబోయే పదేండ్లలో తెలంగాణను 1ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ‘తెలంగాణ ది ప్యూచర్ స్టేట్ ‘ నినాదంతో ప్రజాప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచ అవసరాలు తీర్చగలిగేలా ‘చైనా ప్లస్ వన్ కంట్రీ’ స్థాయిలో ఉంటుందని చెప్పారు.
దావోస్ పర్యటనలో అంగీకారం కుదిరితే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కాగ్నిజెంట్ వారు హైదరాబాద్ లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయడం రికార్డు అని సీఎం అభినందించారు.

శతాబ్దాల మనగడలో హైదరాబాద్ నేడు విశ్వనగరంగా ఎదిగిందని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మద్దతుతో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన నేపథ్యమే హైదరాబాద్ ను ఐటీలో మేటిగా నిలబెట్టిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాతగానీ పాలకులు హైదరాబాద్ విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టారని , ప్రస్తుత ప్రపంచ అవసరాల దృష్ట్యా తాము నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అభివృద్దిని మరో స్థాయికి తీసుకెళుతుందని సీఎం తెలిపారు.
పెట్టుబడుల సాధన కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతం అయ్యాయని, ఒక్క అమెరికాలోనే సుమారు ₹ 31వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని, తద్వారా దాదాపు 30వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెట్టుబడులు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతుందని సీఎం అన్నారు.
తెలంగాణకు మొత్తం మూడు వలయాలు ఉంటాయని, కోర్ అర్బన్ హైదరాబాద్ మొదటి వలయమైతే, రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే రెండోదైన సెమీ అర్బన్ వలయంలో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫ్యూచర్ సిటీ ఉంటాయని, ఇక మూడో వలయమైన రూరల్ తెలంగాణలోని గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

👉మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అన్నింటితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఐటీ మంత్రి తెలిపారు.
తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం సరికొత్తగా ఏఐ సిటీని నిర్మిస్తోందని, సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఏఐ గ్లోబల్ సదస్సును కూడా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.