👉సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల లక్ష్యం అదే కావాలి !
👉సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ద్రౌపది స్వయంవరంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై మాత్రమే కేంద్రీకృతమైనట్టు సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల లక్ష్యం కూడా ఫలితం సాధించడమే కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇతర సమస్యలను పట్టించుకోవద్దని, ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు.
👉 తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో అర్హులైన 135 మందికి ఆర్థిక సహాయంగా రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి సోమవారం చెక్కులను అందించారు. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో ముందున్నా సివిల్స్ సాధనలో బిహార్, రాజస్థాన్‌లతో పోల్చితే వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ప్రస్తుతం మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి రూ.లక్ష సాయం అందించామని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మరో రూ.లక్ష అందిస్తామని ముఖ్యమంత్రిగారు హామీ ఇచ్చారు.
👉 ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చని, కానీ ఈ ప్రభుత్వం మీ వెనుక ఉందనే ఆత్మవిశ్వాసం కల్పించడానికి భరోసా ఇస్తున్నామని తెలిపారు.
👉 తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని సూచించారు. మీ ఎంపికలు మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ జిల్లాకే కాక తెలంగాణకు గర్వకారణమనే విషయం గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
👉 గత ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా ఇటువంటి పనులు ఏం చేయలేదని, ఇప్పటి ప్రజా ప్రభుత్వం మాత్రం విద్య, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ నియామకాలు, ఉపాధి కల్పన, రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
👉 రైతుల రుణమాఫీ కోసం ₹ 31 వేల కోట్లు వెచ్చిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్”ను ఏర్పాటు చేస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్లను నియమించి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
👉 చదువులకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న ఆగధాన్ని పూడ్చేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ”ని ప్రారంభించామని, ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ తెలంగాణ నుంచే సాధించేలా “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తున్నట్టు సీఎం తెలిపారు.
👉 మరో రెండు వారాల్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని, వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
👉 నిరుద్యోగుల బలిదానాలతో అధికారంలోకి వచ్చి, గడిచిన పదేండ్లు యువతను అడుగడుగునా మోసం చేసినవాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయి మళ్ళీ యువతను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి మోసకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, సమస్య ఏదైనా కలిసి చెప్పుకోవచ్చని అన్నారు.

👉 సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు , కోరం కనకయ్య , మాలోత్ రాందాస్ నాయక్ , మట్టా రాగమయి , గండ్ర సత్యనారాయణరావు , గడ్డం వివేక్ వెంకటస్వామి , డాక్టర్ కవ్వంపల్లి సత్యానారాయణ , ఖమ్మం, పెద్దపల్లి ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి , గడ్డం వంశీ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.