వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు!

👉బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో సీఎం రేవంత్ రెడ్డి!


J.SURENDER KUMAR

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది.
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.


టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
యంగాన్‌ కార్పొరేషన్ (Youngone Corporation) చైర్మన్ కియాక్‌ సంగ్‌ (Kihak Sung), కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్‌ జూ (Soyoung Joo) సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు.