J.SURENDER KUMAR,
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు.
👉డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
👉పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు.
👉 కార్డుల ప్రక్రియకు సంబంధించి ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాతిపదికన ప్రాంతాల ఎంపిక పూర్తయిందని అధికారులు వివరించారు.
👉అక్టోబర్ 3 నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు.
👉రేషన్ కార్డు, పింఛను-స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది.
👉పైలెట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందింతే అలాంటి వారిని తొలగిస్తామని అధికారులు వివరించారు.