గురువులను గౌరవిద్దాం …

👉నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం !

@@@@@


మన దేశంలో మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్టన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారు. అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు.
“గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు వచ్చింది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సమాజంలో కొందరు అసూయతో, అక్కసుతో ఉపాధ్యాయులను చిన్నబరచడం మనం చూస్తున్నాం.


ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే ఎవరూ కూడా ఏమీ చెయ్యలే రనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.


ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ …ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.


విద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయంనుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.


కరోనా సమయంలో రష్యా అధ్యక్షుడు కోవిడ్ వేక్సిన్ విడదలచేస్తూ ముందుగా వేక్సిన్ ఉపాధ్యాయులకు వైద్యులకు మాత్రమే ఇవ్వబడుతుందని ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పడం – సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి తెలియచేస్తుంది.భగవంతుడు ,ఉపాధ్యాయుడు ఇద్దరూ ఒకేసారి కనిపిస్తే ముందుగా ఉపాధ్యాయునికే నమస్కరిస్తానని భక్త కబీర్ ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను ప్రపంచానికే తెలియచేసారు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం.

ఈ రోజును ప్రతి విద్యాలయం లోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి.ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి.తల్లిదండ్రులు తమతమ బిడ్డలకు గురువులపట్ల గౌరవభావంను పెంపొందించాలి.అప్పుడే విద్యార్థులకు చదువు రావడానికి అవకాశం ఉంటుంది.


వ్యాసకర్త @ :

యం. రాం ప్రదీప్, జెవివి తిరువూరు,

మొబైల్: 9492712836