కొడంగల్ అసెంబ్లీ విద్యార్థులకు అల్పాహార సౌలభ్యం !

J.SURENDER KUMAR,


కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్‌ (Viatris) ఫార్మా సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి ₹.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు రెండు సంస్థల మధ్య అవగాన ఒప్పందం (MOU) కుదిరింది.


వయాట్రిస్ సీఎస్ఆర్ విభాగం బాధ్యురాలు మిచెల్ డొమినికా , హెచ్‌కెఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస పరస్పరం ఎంవోయూ ప‌త్రాలు మార్చుకున్నారు. సీఎస్ఆర్ వ్యవహారాలు పర్యవేక్షించే T-SIG విభాగం హెడ్ అర్చన సురేశ్ , కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం!


వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది.


భారత్ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.