కులగణన ప్రక్రియను వేగంగా పూర్తిచేయండి సీఎం !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బీసీ కమిషన్‌ను కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.


పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ , సభ్యులు రాపోలు జయప్రకాశ్ , తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మి సచివాలయంలో ముఖ్యమంత్రి తో కలిసి బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు.
కుల గణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎంకమిషన్‌కు సూచించారు.


👉సీఎం సహాయ నిధికి కిమ్స్ విరాళం !


వరద బాధితుల సహాయార్థం కిమ్స్ హాస్పిటల్స్ (KIMS Hospitals) గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది. కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. భాస్కర్ రావు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.


👉సినీ గీత రచయిత చంద్రబోస్ ను అభినందించిన సీఎం !


సినీ గీత రచయిత చంద్రబోస్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. RRR చిత్రంలో “నాటు నాటు” పాటకు సంగీత దర్శకుడు కీరవాణి తో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, పీసీసీ అధ్యక్షులు మహేశ్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి కి ఆస్కార్ పురస్కార ప్రతిమను చూపించగా చంద్రబోస్ ను అభినందించారు.